Nara Lokesh

Nara Lokesh: “బ్లూ బ్యాచ్ సమాజానికి ప్రమాదకరం”: ఫేక్ ప్రచారాలపై చర్యలకు మంత్రి లోకేశ్ ఆదేశం!

Nara Lokesh: తప్పుడు ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మంత్రి నారా లోకేశ్‌ పోలీసులను ఆదేశించారు. అసత్య ప్రచారం ఆధారంగా రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్న ‘బ్లూ బ్యాచ్’ సమాజానికి అత్యంత ప్రమాదకరంగా మారిందని ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు.

లోకేశ్ ఈ అంశంపై స్పందిస్తూ, పక్క రాష్ట్రంలోని ఓ గురుకుల పాఠశాలలో 2023 నాటి పరిస్థితులకు సంబంధించిన పాత వీడియోను తాజాగా అరకులో జరిగినట్లుగా ఒక కథనం రాశారని, దీనిని వైకాపా అనుబంధ సోషల్ మీడియా ఖాతాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.

గతంలో కూడా ఇదే వార్త, వీడియోపై రాష్ట్ర ప్రభుత్వం తరపున ‘ఫ్యాక్ట్ చెక్’ విభాగం సంపూర్ణ వివరాలతో అసలు నిజాన్ని తెలియజేసిందని మంత్రి గుర్తు చేశారు. అయినప్పటికీ, కొద్ది రోజులు సైలెంట్ అయిన ‘బ్లూ బ్యాచ్’ మళ్లీ అదే పాత వీడియోను వాడుకుంటూ తప్పుడు ప్రచారం ప్రారంభించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read: Home Minister Anitha: మొంథా తుపాను నేపథ్యంలో అధికారులకు ఆదేశాలు ఇచ్చిన హోంమంత్రి అనిత

“తరచూ నేరాలకు పాల్పడేవారిని ‘హ్యాబిట్యువల్ అఫెండర్స్’ (నేరాలు చేయడానికి అలవాటు పడ్డవారు) అంటారు. అందుకే అది ఒక రాజకీయ పార్టీనా లేక హ్యాబిట్యువల్ అఫెండర్స్ ముఠానా అనే అనుమానం వస్తుంది” అంటూ లోకేశ్ ఆ బృందాన్ని దుయ్యబట్టారు. తప్పుడు ప్రచారాలతో కులాల మధ్య గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు.

పోలీసులకు ఆదేశాలు
ఈ అసత్య ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మవద్దని విజ్ఞప్తి చేసిన మంత్రి లోకేశ్, ఈ వ్యవహారంపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ పోలీసులకు ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ట్యాగ్ చేశారు. మంత్రి నుంచి ఆదేశాలు అందిన వెంటనే పోలీసులు ఈ వ్యవహారంపై రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ పోస్ట్ ఎక్కడ నుంచి అప్‌లోడ్ అయ్యిందనే దానిపై పోలీసులు కూపీ లాగుతున్నారు. విదేశాల నుంచి కూడా పోస్టింగ్‌లు పెడుతున్న వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉందని, త్వరలోనే అరెస్టులు జరిగే అవకాశం ఉందని సమాచారం.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *