Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు, ఆధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకర్షించడమే లక్ష్యంగా ఐటీ, పరిశ్రమల శాఖా మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియా పర్యటన మూడవ రోజు కూడా బిజీగా సాగింది. సిడ్నీలో మంత్రి లోకేశ్ వివిధ సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు, స్థానిక నాయకులతో సమావేశమయ్యారు.
ఆక్వా ఎగుమతిలో ఏపీ వాటాపై చర్చ
మంత్రి లోకేశ్ ఉదయం సీఫుడ్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా (SIA) ప్రతినిధులు, ఆ సంస్థ సీఈవో వెరోనికా పాపకోస్టాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సముద్ర ఉత్పత్తుల ఎగుమతిలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రగామిగా ఉందని, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం నుంచి దాదాపు $7.4 బిలియన్ డాలర్ల (దాదాపు రూ. 66 వేల కోట్లు) విలువైన 16.98 మిలియన్ టన్నుల ఆక్వా ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అయ్యాయని తెలిపారు. ఇది దేశంలోని మొత్తం ఆక్వా ఎగుమతులలో 60 శాతానికి పైగా ఉందని లోకేశ్ వివరించారు.
Also Read: Vangalapudi Anitha: పోలీసులు లేకుంటే ప్రశాంతత లేదు
సహకారం కోసం విజ్ఞప్తి: ఆస్ట్రేలియా, ఇతర అంతర్జాతీయ కొనుగోలుదారులతో ఆంధ్రప్రదేశ్ ఆక్వా పరిశ్రమదారులను అనుసంధానించేందుకు ట్రేడ్ మిషన్లు, నెట్‌వర్కింగ్ కార్యక్రమాలు చేపట్టాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.
సాంకేతికత బదిలీ: ఆక్వా ఉత్పత్తుల నాణ్యతను, నిల్వ కాలాన్ని పెంచడానికి వీలుగా ప్రాసెసింగ్, కోల్డ్ చైన్ మేనేజ్‌మెంట్, ప్యాకేజింగ్ రంగాల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏపీకి అందించాలని లోకేశ్ కోరారు.
సుస్థిరత లక్ష్యం: పర్యావరణ ప్రభావాన్ని తగ్గించి, ఉత్పత్తిని పెంచడానికి అవసరమైన స్థిరమైన ఆక్వా కల్చర్ (Sustainable Aquaculture) నిర్వహణలో ఆస్ట్రేలియా నైపుణ్యాన్ని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమదారులతో పంచుకోవాలని లోకేశ్ కోరారు.
సిడ్నీ యూనివర్సిటీ, స్థానిక నాయకులతో భేటీ
మధ్యాహ్నం మంత్రి లోకేశ్ సిడ్నీ యూనివర్సిటీని సందర్శించి, సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు, వ్యవసాయ సాంకేతిక నిపుణులతో సమావేశమయ్యారు. విద్య, పరిశోధన రంగాలలో సహకారంపై చర్చించారు.
సాయంత్రం, పారమట్టా లార్డ్ మేయర్ మార్టిన్ జైటర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయిన లోకేశ్, స్మార్ట్ సిటీలు, స్థానిక పరిపాలనలో జైటర్ కృషిని అభినందించారు. స్టార్టప్ స్టేట్‌గా ఎదుగుతున్న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాల అభివృద్ధికి పారమట్టా మోడల్ తరహాలో సహకారం అందించాలని కోరారు.
అనంతరం, లోకేశ్ హారిస్ పార్కులో ‘లిటిల్ ఇండియా’ పేరుతో ఏర్పాటు చేసిన రివర్ సైడ్ ఫుడ్ కోర్టును సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ సముద్ర ఉత్పత్తులు, వంటకాలను ప్రోత్సహించడానికి ఉమ్మడి కార్యక్రమాల ఆవశ్యకతపై కూడా ఈ పర్యటనలో చర్చ జరిగింది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో వాతావరణ మార్పుల ప్రభావాన్ని ఎదుర్కొనే ప్రాజెక్టులపై కలిసి పనిచేయాలని లోకేశ్ ఈ సందర్భంగా ప్రతిపాదించారు.