Minister Lokesh: శ్రీలంకలో తలెత్తిన ‘దిత్వా’ తుపాను కారణంగా కొలంబోలో చిక్కుకుపోయిన తెలుగు ప్రజలను సురక్షితంగా స్వదేశానికి రప్పించేందుకు రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ తక్షణమే చర్యలు చేపట్టారు. విమానాలు రద్దు కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రయాణీకుల విజ్ఞప్తిపై ఆయన సానుకూలంగా స్పందించారు.
తెనాలి, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాలకు చెందిన 25 మంది తెలుగు పర్యాటకులు ఏడు రోజుల పర్యటన నిమిత్తం శ్రీలంకకు వెళ్లారు. ఊహించని తుపాను ప్రభావంతో వారు అక్కడే చిక్కుకుపోయి, తమను త్వరగా భారత్‌కు తీసుకురావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్‌లను కోరారు.
Also Read: Vaikuntha Dwara Darshan: వైకుంఠ ద్వార దర్శనాలకు రికార్డుస్థాయిలో భక్తుల రిజిస్ట్రేషన్లు!
ప్రయాణీకుల విజ్ఞప్తి అందిన వెంటనే మంత్రి లోకేశ్ తన కార్యాలయ అధికారులను అప్రమత్తం చేశారు. కొలంబో, చెన్నైలోని సంబంధిత అధికారులతో తక్షణమే సమన్వయం చేసుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కొలంబోలో చిక్కుకున్న తెలుగు వారికి అవసరమైన అన్ని సహాయక చర్యలు అందించాలని, అలాగే వారు త్వరితగతిన స్వదేశానికి చేరుకునేలా ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులకు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన తన కార్యాలయానికి అధికారిక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ చొరవతో ఈ తెలుగు పర్యాటకులు త్వరలోనే సురక్షితంగా తమ స్వస్థలాలకు చేరుకుంటారని ఆశిస్తున్నారు.
