Minister Lokesh: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు, నైతిక విలువలు పెంపొందించడంపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విద్యాశాఖ నిర్వహించిన ‘విలువల విద్య’ సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ప్రభుత్వ సలహాదారు, ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు కూడా వేదికను పంచుకున్నారు.
విద్యావ్యవస్థలో నూతన మార్పులు
రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్నట్లు మంత్రి లోకేశ్ ప్రకటించారు. దీనిలో భాగంగానే మెగా డీఎస్సీ ద్వారా టీచర్ పోస్టులను పెద్ద ఎత్తున భర్తీ చేస్తున్నామని తెలిపారు. విద్యా విధానాన్ని కేజీ (KG) నుంచి పీజీ (PG) వరకు కరికులంలో మార్పులు తీసుకొస్తూ, సమూలంగా మారుస్తున్నామని చెప్పారు.
నైతిక విలువలు, సమాజంలో మార్పుకు సంబంధించి ప్రభుత్వ సలహాదారుగా చాగంటి కోటేశ్వరరావును క్యాబినెట్ ర్యాంకుతో నియమించినట్లు లోకేశ్ తెలిపారు. విద్యార్థుల కోసం రూపొందించిన పుస్తకాల్లో ఎక్కడా ప్రజాప్రతినిధుల ఫోటోలు లేదా పార్టీ రంగులు లేవని, కేవలం విద్యార్థుల భవిష్యత్ కోసమే వీటిని రూపొందించామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా, చాగంటి కోటేశ్వరరావు ప్రభుత్వ వాహనం కూడా వాడకుండా, సొంతంగానే ఫోన్ బిల్లు చెల్లిస్తూ బాధ్యతగా పనిచేస్తున్నారని లోకేశ్ కొనియాడారు.
Also Read: Tummala nageshwar rao: మరక లేకపోవడానికి కారణం ఎన్టీఆరే
పిల్లల్లో మార్పు ఇంటి నుంచే మొదలు కావాలి
పాఠశాలలో ఉపాధ్యాయులపై పిల్లలను సరైన మార్గంలో పెట్టాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ, మార్పు అనేది ఇంటి నుంచే మొదలవ్వాలని మంత్రి లోకేశ్ సూచించారు. పిల్లల పట్ల తల్లిదండ్రులు మరింత బాధ్యత వహించాలని కోరారు.
మహిళలను గౌరవించినప్పుడే సమాజం బాగుపడుతుందని ఆయన నొక్కి చెప్పారు. సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లలోనూ మహిళలను అగౌరవంగా చూపించకూడదని ఆయన హితవు పలికారు. అంతేకాకుండా, డ్రగ్స్‌పై తమ ప్రభుత్వం ఇప్పటికే యుద్ధం ప్రకటించిందని, దీన్ని ప్రతి ఒక్కరూ సీరియస్‌గా తీసుకోవాలని కోరారు.
విజయం సాధించాలంటే లక్ష్యంతో పనిచేయాలి
తన వ్యక్తిగత అనుభవాన్ని పంచుకుంటూ, 2019 ఎన్నికల్లో తాను ఓడిపోయిన విషయాన్ని లోకేశ్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో ఎంతో మంది అవమానించినా, లక్ష్యం పెట్టుకొని పనిచేయడం వల్లే ఈసారి 90 వేల మెజార్టీతో గెలుపు సాధించగలిగానని తెలిపారు. అందువల్ల, జీవితంలో అవమానాలు సహజమని, మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదని విద్యార్థులకు సూచించారు. లక్ష్యంతో పనిచేస్తే విజయం తప్పక సాధించవచ్చని ఆయన చెప్పారు.
ఈ సదస్సులో టీచర్ల సమస్యలను కూడా తమ ప్రభుత్వం చాలా వరకు పరిష్కరించిందని లోకేశ్ పేర్కొన్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ కోసం అన్ని నియోజకవర్గాల్లో నైతిక విలువలపై ప్రసంగాలు చేయాలని మంత్రి, చాగంటి కోటేశ్వరరావును కోరారు.

