Konda Surekha: విద్యను ప్రోత్సహించడంలో ప్రభుత్వ మంత్రుల పాత్ర ఎటువంటి దిశలో సాగాలన్నదానికే ఉదాహరణగా నిలుస్తోంది తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ తాజా వ్యాఖ్యలు. వరంగల్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
వివరాల్లోకి వెళ్తే – వరంగల్ పట్టణంలోని కృష్ణ కాలనీ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో కొత్త భవన నిర్మాణానికి అరబిందో ఫార్మా ఫౌండేషన్ రూ.5 కోట్ల సిఎస్‌ఆర్ నిధులు విడుదల చేసింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమంలో మంత్రి సురేఖ మాట్లాడుతూ – “చాలా మంది మంత్రులు తమ వద్దకు వచ్చే కంపెనీల ఫైళ్లను క్లియర్ చేసేందుకు డబ్బులు తీసుకుంటారు. కానీ నేను మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరించాను” అని పేర్కొన్నారు.
“నా వద్దకు కూడా కొన్ని కంపెనీల ఫైళ్లు వచ్చాయి. ఆ సమయంలో నేను వాళ్లను అడిగాను – డబ్బు ఇవ్వకండి, మా సమాజానికి సేవ చేయండి. బాలికల చదువుకి ఉపయోగపడేలా మా ప్రభుత్వ కళాశాలకు ఒక మంచి భవనం కడతే మీ పేరు గుర్తుండిపోతుంది అని చెప్పాను,” అని తెలిపారు.
ఇది కూడా చదవండి: India Vs Pak: పాక్ భారత్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది, కుక్కలా పారిపోయింది… అమెరికా కీలక వాక్యాలు
ఈ మాటలు విని అరబిందో ఫార్మా ప్రతినిధులు స్పందించి, రూ.4.5 కోట్ల విలువైన సిఎస్‌ఆర్ నిధులతో భవనం నిర్మించేందుకు ముందుకు వచ్చారని చెప్పారు మంత్రి. ఈ భవనం గ్రౌండ్, రెండంతస్తులతో నిర్మించబడుతోంది. ఇందులో 15 క్లాస్‌రూములు, ఒక పెద్ద హాల్, 60 టాయిలెట్లు, ఆధునిక ఫర్నిచర్ కల్పించనున్నారు.
ఇలాంటి అభివృద్ధి పనులు విద్యార్థుల భవిష్యత్తును మెరుగుపరుస్తాయని, ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల భాగస్వామ్యంతోనే సామాజిక ప్రగతి సాధ్యమవుతుందని మంత్రి స్పష్టం చేశారు.
ఈ వ్యాఖ్యలు ఒకవైపు మంత్రుల వ్యవహారశైలిపై విమర్శలు చేస్తూ, మరోవైపు తన తీరును న్యాయంగా నిలబెడుతూ ప్రాధాన్యతను సొంతం చేసుకున్నాయి. సమాజానికి సేవ చేసే దృక్పథం కలిగిన నాయకులు ఉంటే విద్యారంగం దశల మార్పుకు సిద్ధమవుతుందన్న ఆశను ప్రజల్లో కలిగిస్తోంది.