Konda Surekha

Konda Surekha: కొండా సురేఖ వివాదానికి ఎండ్‌కార్డ్‌: సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పిన మంత్రి

Konda Surekha: తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో వారం రోజులుగా తీవ్ర చర్చనీయాంశమైన మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్‌కు తెరపడినట్టే కనిపిస్తోంది. తన కూతురు కొండా సుస్మిత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై చేసిన సంచలన ఆరోపణలపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. గురువారం జరిగిన కేబినెట్ సమావేశం తర్వాత ఆమె మీడియా సమావేశంలో పాల్గొని, సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పారు.

క్షమాపణలతో సద్దుమణిగిన వివాదం
కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన కొండా సురేఖ, వివాదంపై స్పష్టత ఇచ్చారు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని, అన్నీ సర్దుకున్నాయని తెలిపారు. “మాది అంతా కాంగ్రెస్ కుటుంబం. టీ కప్పులో తుఫాను మాదిరిగా కొన్ని అపార్థాలు చోటుచేసుకున్నాయి. కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం. అందరం కలిసి ముందుకు వెళ్తాం” అని ఆమె పేర్కొన్నారు.

తన కూతురు చేసిన వ్యాఖ్యల గురించి ప్రస్తావిస్తూ, “మా పాప పోలీసులు ఇంటికి రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రిపై ఏదైతే మాట్లాడిందో, అందుకు నేను క్షమాపణలు చెబుతున్నాను” అని కొండా సురేఖ ప్రకటించారు. తన కూతురు నోరు జారిందని ఆమె ఒప్పుకున్నారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డితో కొండా సురేఖ దంపతులు భేటీ అయిన తర్వాత ఈ వివాదం సద్దుమణిగినట్టుగా కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలోనే ఆమె కేబినెట్ సమావేశానికి హాజరయ్యారు.

Also Read: Delhi: రూ.79 వేల కోట్ల విలువైన ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్

వివాదానికి కారణాలు
మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ (OSD) సుమంత్‌ వ్యవహారంతో ఈ వివాదం మొదలైంది. సుమంత్‌పై వచ్చిన అక్రమాల ఆరోపణల కారణంగా ప్రభుత్వం అతనిపై వేటు వేసి విచారణకు ఆదేశించింది. సుమంత్‌ను అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు మంత్రి కొండా సురేఖ ఇంటికి మఫ్టీలో వెళ్లారు.

అక్కడే అసలు హైడ్రామా చోటుచేసుకుంది. మంత్రి కూతురు కొండా సుస్మిత మఫ్టీలో వచ్చిన పోలీసులతో వాగ్వాదానికి దిగి, సుమంత్‌ అరెస్టుకు గల కారణాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన సుస్మిత, ఈ పరిణామాల వెనుక కాంగ్రెస్ పెద్దలే ఉన్నారని, తన తల్లి ప్రతిష్టను దెబ్బతీయడానికి పార్టీలోని రెడ్డి వర్గం నాయకులు కుట్ర పన్నుతున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ కుట్ర వెనుక సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డిల పేర్లను కూడా ఆమె స్పష్టంగా ప్రస్తావించారు.

ఉమ్మడి వరంగల్ ఇంఛార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి, కొండా సురేఖకు మధ్య ఇప్పటికే విభేదాలు ఉన్నట్టుగా వార్తలు వచ్చిన నేపథ్యంలో, సురేఖ క్షమాపణతో ప్రస్తుతానికి సమస్య సద్దుమణిగినా, భవిష్యత్తులో ఈ నాయకుల మధ్య పరిస్థితులు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి. ఈ వివాదంపై స్పందిస్తూ, కేటీఆర్‌కు బదులిచ్చిన కొండా సురేఖ, “కేటీఆర్ ముందు దూరమైన చెల్లిని దగ్గరకు తీసుకుని, ఆమెను ప్రేమగా చూసుకోవడం నేర్చుకోవాలి” అని ఘాటుగా విమర్శించారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *