Minister bala: రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని బృందం సింగపూర్ పర్యటనపై ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి స్పందించారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆయన ప్రశంసించారు.
ఇదే సందర్భంలో గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. పెట్టుబడుల పేరిట వైఎస్ జగన్ నాయకత్వంలోని ప్రభుత్వంలోని నేతలు విదేశాల్లో విహారయాత్రలు చేశారని ఆరోపించారు. ప్రజాధనాన్ని ఫారెన్ టూర్ల పేరుతో దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. జగన్ పాలన కాలంలో విధ్వంసం జరిగిందని, సింగపూర్‌తో ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న మంచి సంబంధాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రస్తుతం చంద్రబాబుపై ఉన్న విశ్వాసంతోనే పరిశ్రమలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయని మంత్రి తెలిపారు. “అపోలో టైర్స్ కంపెనీని చంద్రబాబు రాష్ట్రానికి తీసుకువచ్చారు. కానీ జగన్ తన ఐదేళ్ల పాలనలో కనీసం సైకిల్ ట్యూబ్ కంపెనీ అయినా తీసుకురాలేదు,” అంటూ మంత్రి డోలా స్వామి ఎద్దేవా చేశారు.
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించే దిశగా పరిశ్రమలను ఆకర్షిస్తున్నామని, పెట్టుబడులు రాబడుతున్నాయని మంత్రి స్పష్టంచేశారు.