Minister Atchannaidu

Minister Atchannaidu: పత్తి రైతులకు అండగా నిలబడండి.. కేంద్రానికి మంత్రి అచ్చెన్నాయుడు విజ్ఞప్తి

Minister Atchannaidu: ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పత్తి రైతుల సమస్యలపై తక్షణమే దృష్టి సారించాలని కోరుతూ కేంద్ర టెక్స్‌టైల్ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్‌కు తాజాగా ఒక లేఖ రాశారు. మొంథా తుఫాను కారణంగా రాష్ట్రవ్యాప్తంగా పత్తి పంట తీవ్రంగా నష్టపోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో రైతులు తమ పంటను కనీస మద్దతు ధర (MSP) కన్నా చాలా తక్కువ ధరలకు అమ్ముకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని మంత్రి లేఖలో పేర్కొన్నారు.

సాంకేతిక సమస్యలు, కొనుగోలులో ఇబ్బందులు
మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన వివరాల ప్రకారం, 2025–26 ఖరీఫ్ సీజన్‌లో రాష్ట్రంలో సుమారు 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగు జరుగుతుందని, దాదాపు 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని అంచనా. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే CM APP మరియు ఆధార్ ఆధారిత e-పంట వ్యవస్థ ద్వారా డిజిటల్ పద్ధతిలో పత్తి కొనుగోళ్లు నిర్వహిస్తోంది. అయితే, కేంద్రం ప్రవేశపెట్టిన ‘కపాస్ కిసాన్ యాప్’ను రాష్ట్ర CM APP తో అనుసంధానం చేసిన తర్వాత సాంకేతిక సమస్యలు మొదలయ్యాయి. ఈ కారణంగా రైతులు తమ పంటను అమ్ముకోవడంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన తెలిపారు. రైతులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు, రెండు యాప్‌ల మధ్య రైతుల వివరాలు ఎప్పటికప్పుడు సరిగ్గా సమన్వయం అయ్యేలా చర్యలు తీసుకోవాలని కేంద్రానికి మంత్రి సూచించారు.

Also Read: Tirumala: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం!

జిన్నింగ్ మిల్లుల మ్యాపింగ్, ప్రత్యేక సిబ్బంది నియామకం
మంత్రి అచ్చెన్నాయుడు లేఖలో ముఖ్యంగా ప్రస్తావించిన మరో అంశం ఏమిటంటే, రైతులు తమ పత్తిని దూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా, సమీపంలోని జిన్నింగ్ మిల్లుల్లోనే విక్రయించుకునేలా మ్యాపింగ్ చేయాలి అని కోరారు. అలాగే, L1, L2, L3 కేటగిరీలకు చెందిన జిన్నింగ్ మిల్లులన్నింటినీ ఒకేసారి ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు, కపాస్ కిసాన్ యాప్ నిర్వహణ కోసం గుంటూరులో ప్రత్యేకంగా సాంకేతిక సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఉందని కూడా ఆయన సూచించారు.

తేమ శాతం, నష్టపరిహారంపై హామీ అవసరం
వాతావరణ మార్పుల కారణంగా పత్తిలో తేమ శాతం 12–18 శాతం వరకు ఉన్నప్పటికీ, దానికి అనుగుణంగా ధరలో తగ్గింపులు చేసి కొనుగోలు చేయాలని మంత్రి కోరారు. అంతేకాక, వర్షాలకు తడిసిన లేదా రంగు మారిన పత్తికి కూడా తగిన ధర చెల్లించడం ద్వారా రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఇలాంటి చర్యలు తీసుకుంటే రైతుల అసంతృప్తి తగ్గుతుందని, వారికి ఆర్థిక భరోసా లభిస్తుందని అచ్చెన్నాయుడు గారు నమ్మకం వ్యక్తం చేశారు. తుఫాను వంటి సహజ విపత్తులతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ పత్తి రైతులను ఆదుకోవడంలో కేంద్రం తక్షణ సహకారం అందించాలని ఆయన తన లేఖను ముగించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *