jagan

Jagan: జగన్‌ కనుసన్నల్లో మైనింగ్‌ మాఫియా..!

Jagan: గత వైసీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా మైనింగ్‌ కుంభకోణాలు భారీగా జరిగాయి. ప్రకాశం జిల్లాలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చీమకుర్తి గ్రానైట్‌ పరిశ్రమలోనైతే అంతా వైసీపీ నేతల ఇష్టారాజ్యమే నడిచింది. అప్పటి సీఎం వైఎస్. జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లోనే మైనింగ్‌ దోపిడీ జరిగిందని, ఆదాయంలో తాడేపల్లి ప్యాలెస్‌కు వాటా ఉందన్న ఆరోపణలు వచ్చాయి. గెలాక్సీ గ్రానైట్‌ క్వారీల్లో జరిగిన దోపిడీ వ్యవహారాన్ని పరిశీలిస్తే అది నిజమని తేటతెల్లమవుతోంది. చీమకుర్తి మండలంలోని గెలాక్సీ గ్రానైట్‌ క్వారీల్లో ఆంధ్రప్రదేశ్‌ గనుల అభివృద్ధి కార్పొరేషన్‌ పరిధిలో 86 ఎకరాల భూమి ఉంది. అందులో 25 ఎకరాలు వివాదంలో చిక్కుకుంది. అది పోను సుమారు 61 ఎకరాల భూమి ఏపీఎండీసీ పరిధిలోనే ఉంది. అందులో సుమారు 43 ఎకరాలను కార్పొరేషన్‌ జాయింట్‌ వెంచర్‌లో లీజుకు ఇచ్చింది. అక్కడ నాణ్యమైన గెలాక్సీ గ్రానైట్‌ నిక్షేపాలు లభిస్తుండటంతో జాయింట్‌ వెంచర్‌లో లీజు కోసం అప్పట్లో పోటీ కూడా పడ్డారు.

అధికారంలో ఏపార్టీ ఉన్నా చక్రం తిప్పగల మిడ్‌వెస్టు సంస్థ దానిని దక్కించుకుంది. రాష్ట్రంలో జగన్‌ ప్రభుత్వం ఏర్పడగానే ఆ సంస్థ అధిపతి రాఘవరెడ్డి తానే జగన్‌ అన్న స్థాయిలో ఎగిరిపడ్డారు. కానీ మూడు, నాలుగు మాసాలు తిరక్కుండానే ఆయనకు సీఎం కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చింది. జాయింట్‌ వెంచర్‌లోని సగం క్వారీల్లో వ్యాపారం తాము పంపే మనుషులు చేసుకుంటారు. ఆదాయం అంతా వారికే దక్కుతుంది. కాదూకూడదంటే మొదటికే మోసం వస్తుంది జాగ్రత్త అంటూ హెచ్చరించారు. ఆ ఫోన్‌ వచ్చిన మరుసటి రోజే ప్రతాప్‌రెడ్డి అనే గ్రానైట్‌ వ్యాపారి అక్కడ ప్రత్యక్షమయ్యారు.

స్థానికంగా ప్రైవేటు స్థలంలో క్వారీలు నిర్వహిస్తున్న ప్రతాప్‌రెడ్డి స్వయానా కడప ఎంపీ అవినాష్‌ రెడ్డికి మామ. అప్పటి నుంచి  సుమారు 20 ఎకరాల విస్ర్తీర్ణంలోని గ్రానైట్‌లో వచ్చే ఆదాయమంతా వీరే సొంతం చేసుకున్నారు. ఎలాంటి పెట్టుబడి లేకుండా నెలవారీ సరాసరి రూ.3కోట్ల ప్రకారం ఐదేళ్లలో రూ.150కోట్ల ఆదాయం పొందారు. అదంతా అవినాష్‌ రెడ్డి కుటుంబానికి చేరిందా? అందులో జగన్‌ వాటా ఉందా? ఉంటే ఎంత? అనేది పక్కన పెడితే రమారమి వందల కోట్ల ఆదాయం పొందారు.

ఇది కూడా చదవండి: Jagan: ద్వారంపూడి దందా..అడ్డంగా జగన్..

Jagan: జగన్‌ ప్రభుత్వం ఏర్పడిన ఆరునెలల్లోపే కడప జిల్లాకు చెందిన వైసీపీ చోటా నాయకులు చీమకుర్తి ప్రాంతానికి భారీగా దిగుమతి అయ్యారు. కొందరు పుష్కలంగా గెలాక్సీ నిక్షేపాలు ఉండి వివాదాల్లో ఉన్న స్ధలాలను కొట్టేసే ప్రయత్నాలు చేశారు. అదే సమయంలో వ్యక్తులు, సంస్థల మధ్య వివాదాలు ఉన్న అంశాల్లో జోక్యం చేసుకొని సెటిల్‌మెంట్‌ పేరుతో భారీగా సొమ్ము చేసుకున్నారు. క్వారీల్లో వేస్టు రాయిని బలవంతంగా సొంతం చేసుకొని దండుకోవడంతోపాటు దానిపై ఆధారపడి నడుస్తున్న పరిశ్రమలు మూతపడేందుకు దోహదపడ్డారు. వైసీపీ అధికారంలోకి రాక ముందు వరకూ గ్రానైట్‌ క్వారీల్లో రాయిని ఎగుమతి చేసిన తర్వాత మిగిలిన వేస్టు రాయిని స్థానికంగా ఉండే పాలిషింగ్‌ పరిశ్రమలకు అమ్ముకునే వారు. కొందరైతే రాజకీయ సిఫార్సులకు అనుకూలంగా ఆ రాయిని స్థానికంగా ఉండే నాయకులకు అప్పగించే వారు. 

పాలిషింగ్‌ యూనిట్లకు సాధారణ ధరకు సరఫరా చేసేవారు. కొందరు చోటా నాయకులు పాలిషింగ్‌ యూనిట్లు ఏర్పాటు చేసి క్వారీలో వచ్చే వేస్టు రాయి పొందడం ద్వారా జీవనోపాధి పొందేవారు. ఆ రకంగా వచ్చే క్వారీల్లోని వేస్టు రాయిని వివిధ సైజుల్లో పాలిషింగ్‌ చేసి దేశీయ మార్కెట్‌లో విక్రయించి ఆదాయం పొందేవారు. అలాంటి పరిశ్రమలు వేలసంఖ్యలో జిల్లాలో ఏర్పడ్డాయి. ఆ పరిశ్రమలో సుమారు 25 వేలమంది పనిచేస్తూ అదే ఉపాధిగా కుటుంబాలను పోషించుకునే వారు. వైసీపీ పాలనలో వారంతా తీవ్ర ఇబ్బంది పడ్డారు.

ఇది కూడా చదవండి: KTR: రాజకీయాలకు కేటీఆర్ బ్రేక్… ఈ విరామం వెనక అంత పెద్ద వ్యూహం ఉందా?

Jagan: కడప నుంచి వచ్చిన వైసీపీ నేతలు క్వారీల్లో వేస్టు రాయి మొత్తం తమకే ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేదంటే కేసులు పెట్టించి క్వారీలను మూసివేయిస్తామని నిర్వాహకులను బెదిరించారు. అప్పటికే ప్రభుత్వం క్వారీ యజమానులకు నోటీసులు ఇచ్చి అందులో టీడీపీలో ముఖ్యులైన వారికి చెందినవి మూసివేసేందుకు శ్రీకారం పలికింది. ఇటు వచ్చిన వారు కడప జిల్లా వారు కావడం, అటు ప్రభుత్వం కూడా దూకుడుగా వ్యవహరిస్తుండటంతో క్వారీల యజమానులు ఈ వేస్టు రాయిని స్థానికులకు కాకుండా కడప వాసులకు ఇవ్వడం ప్రారంభించారు ఏపీఎండీసీలో అటు అవినాష్‌రెడ్డి కుటుంబీకులు స్వాధీనం చేసుకున్న క్వారీల్లో కానీ, ఇటు విఘ్నేష్‌ సంస్థ కింద ఉన్న క్వారీల్లో కానీ వేస్టు రాయి దక్కాలంటే వారి కనీస అర్హత కడప జిల్లా వాసి కావడంగా మారింది.

జిల్లా స్థాయి నేతల నుంచి తిరుగుబాటు రావడంతో అప్పట్లో మంత్రిగా ఉన్న బాలినేని చెప్పిన కొందరికి ఆ రాయిని ఇచ్చారు. అలాంటి వారు కూడా క్వారీ యజమానులను బెదిరించి ఆ రాయిని ఉచితంగా పొందారు. దాన్ని వారు రాజకీయంగా ఎంపిక చేసుకున్న, లేక వారు అడిగిన డబ్బులు ఇచ్చే పాలిషింగ్‌ యూనిట్లకే సరఫరా చేశారు. దీంతో ముడిసరుకు అందక వందల పాలిషింగ్‌ యూనిట్లు మూతపడ్డాయి. ప్రభుత్వం మారినా రౌడీయిజంతో అంతోఇంతో చెలాయించాలని చూసిన వీరు తాజాగా సీఎం చంద్రబాబు గనుల దోపిడీపై శ్వేతపత్రం విడుదల చేసి దోపిడీదారుల అంతు చూస్తానని ప్రకటించడంతో తట్టాబుట్టా సర్దుకొని కడప వెళ్లిపోయారు. ఇలా గెలాక్సీ గ్రానైట్‌ రంగంలో చొరబడి కోట్ల రూపాయలు దండుకున్న కడప జిల్లాకు చెందిన జగన్‌ పరివారం గత కొన్ని రోజుల్లోనే క్వారీలను పూర్తిగా వదిలి వెళ్లిపోవడం విశేషం. మరి కడప నుంచి వచ్చిన జగన్‌ గ్యాంగ్‌ నిర్వహించిన ఈ రకమైన దోపిడీపై కూటమి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సి ఉంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *