Mini Madaram: తెలంగాణలో ప్రతిష్టాత్మకమైన ములుగు జిల్లలోని మేడారం సమ్మక్క సారలమ్మ మినీ జాతర ఈ రోజు (ఫిబ్రవరి 12) నాలుగు రోజులపాటు సాగనున్నది. ఈ నెల 15 (ఫిబ్రవరి) వరకు ఈ జాతర కొనసాగుతుంది. నిరుడు మెగా జాతర పెద్ద ఎత్తున జరగగా, ఈ సారి జరిగే జాతరను మినీ జాతరగా పిలుచుకుంటారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి మొక్కులు చెల్లించుకోనున్నారు.
Mini Madaram: మేడారం మినీ జాతరను తొలిరోజైన బుధవారం నాడు మండెమెలిగే పండుగతో ప్రారంభిస్తారు. అయితే మహా జాతరకు భిన్నంగా ఈ జాతరను నాలుగు రోజులపాటు వైభవంగా నిర్వహిస్తారు. సమ్మక్క, సారలమ్మల పూజారులు అమ్మవార్ల గద్దెలను శుద్ధిచేసి ప్రత్యేక పూజలు చేసే పండుగనే మినీ జాతరగా పిలుచుకుంటారు.
Mini Madaram: తొలిరోజు బుధవారం సారలమ్మ పండుగ నేపథ్యంలో కొండాయిలోని గోవిందరాజులు గుడిలో, పునుగుల్లలోని పగిడిద్దరాజుల గుడితోపాటు కన్నెపల్లిలోని సారలమ్మ ఆలయాన్ని శుద్ధి చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత పూజారులు మేడారం ఆలయానికి చేరుకొని సారలమ్మ గద్దెను శుభ్రం చేసి పూజలు చేస్తూ అక్కడే జాగారం చేస్తూ అమ్మవార్లను కొలుస్తారు.
Mini Madaram: గురువారం రోజు సమ్మక్క గద్దెను శుద్ధి చేసి సమ్మక్క, సారలమ్మలకు భక్తులు మొక్కులు సమర్పించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ పూజలు చేస్తారు. 14న శుక్రవారం, 15న శనివారం రోజుల్లో భక్తులు భారీగా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు.
Mini Madaram: ఈసారి మేడారం మినీ జాతరను గతం కంటే భిన్నంగా జరిపేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మహాకుంభమేళా నేపథ్యంలో పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు భక్తుల కోసం వసతీ సౌకర్యాలు కూడా ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ అధికారులు కూడా వివిధ విభాగాల ఆధ్వర్యంలో సౌకర్యాల కల్పనకు చర్యలు తీసుకున్నారు. ప్రధానంగా ప్రజారవాణా కోసం ఆర్టీసీ బస్సులను నడపనున్నారు. వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బందిని ఏర్పాటు చేశారు. దీంతోపాటు గతం కంటే అధికంగా భక్తులు తరలివస్తారని కూడా భావిస్తున్నారు.