Puri Rath Yatra: ప్రపంచ ప్రసిద్ధి గాంచిన పూరీ జగన్నాథ రథయాత్ర శుక్రవారం (జూన్ 27) ఒడిశాలోని పూరీలో వైభవంగా ప్రారంభం కానుంది. ఈ ఆధ్యాత్మిక వేడుకలో 12 లక్షల మందికి పైగా భక్తులు పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ భారీ సంఖ్యలో వచ్చే భక్తుల కోసం అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది.
అత్యున్నత స్థాయి భద్రతా ఏర్పాట్లు
ఈ సంవత్సరం భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబడింది. మొదటిసారిగా, రద్దీని నియంత్రించడానికి 275 ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) కెమెరాలు, డ్రోన్‌లను ఉపయోగించనున్నారు. అదనంగా, 10 వేల మందికి పైగా పోలీసు సిబ్బంది, జవాన్లను మోహరించారు. భూమిపై, నీటిలో, ఆకాశంలో కూడా కట్టుదిట్టమైన నిఘా ఉంచినట్లు డీజీపీ యోగేష్ బహదూర్ ఖురానియా గురువారం పూరీలో విలేకరులకు తెలిపారు.
జగన్నాథ స్వామికి “నందిఘోష్”, బలభద్రుడికి “తాళధ్వజ”, దేవి సుభద్రకు “దర్పదళన్” అనే రథాలను ఎంతో అందంగా అలంకరించారు. శ్రీక్షేత్రంలోని ప్రధాన గుడిలో ఉండే శ్రీకృష్ణుడు (జగన్నాథుడు), ఆయన అన్న బలరాముడు, చెల్లి సుభద్ర దేవిల మూల విగ్రహాలను రథాలపై ఉంచి ఊరేగించడం పూరీ రథయాత్రలోని ఒక ప్రత్యేకత. సాధారణంగా ఇతర ఆలయాల్లో ఉత్సవ విగ్రహాలను ఊరేగిస్తారు, కానీ పూరీలో మాత్రం మూల విగ్రహాలనే బయటకు తీసుకొస్తారు. ప్రతి సంవత్సరం ఈ రథాలను కొత్తగా తయారుచేస్తారు.
Also Read: Esha-Sajid: బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన ఈషా-సాజీద్ వివాదం?
లక్షలాది మంది భక్తులు ఈ భారీ రథాలను లాగుతూ, జగన్నాథుడి ఆలయ ప్రాంగణం నుంచి సుమారు 2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్న పెంచిన తల్లి గుండిచా దేవి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ మూడు విగ్రహాలు వారం రోజుల పాటు విశ్రాంతి తీసుకుని, తొమ్మిదో రోజున తిరిగి ప్రధాన ఆలయానికి వస్తాయి.
భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లు
ఈ భారీ వేడుకను దృష్టిలో ఉంచుకుని, ఈస్ట్‌కోస్ట్ రైల్వే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఆలయ పరిసరాలన్నీ భక్తులతో నిండిపోయాయి. రెండు నెలల ముందు నుంచే దేవస్థానం రథయాత్రకు భారీ ఏర్పాట్లు చేసింది. రాజు బంగారు చీపురుతో రథయాత్రను ప్రారంభించడం ఇక్కడ ఒక ఆనవాయితీ. ఈ యాత్రను చూడటం భక్తులు ఒక అదృష్టంగా భావిస్తారు.