Micro Sculptor Ganesha: వినాయక చవితి సందర్భంగా వరంగల్‌కి చెందిన సూక్ష్మ శిల్పకళాకారుడు మట్టెవాడ అజయ్ కుమార్ మరో అద్భుతాన్ని సృష్టించారు. మానవ వెంట్రుక అంచుపై కేవలం 0.37 మిల్లీమీటర్ల (370 మైక్రాన్లు) ఎత్తులో నాట్యమాడుతున్న గణపతి విగ్రహాన్ని చెక్కి ప్రపంచానికి తన కళను చాటుకున్నారు. ఈ విగ్రహం మానవ కంటికి కనిపించదు, కేవలం సూక్ష్మదర్శిని (Microscope) ద్వారా మాత్రమే వీక్షించవచ్చు.
అజయ్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ సూక్ష్మ కళాఖండాన్ని పూర్తి చేయడానికి ఆయన రెండు నెలల కాలంలో దాదాపు 120 గంటలు కష్టపడ్డారు. సూక్ష్మమైన మైనపు, ఇసుక రేణువులు, ప్లాస్టిక్ పౌడర్‌ను ఉపయోగించడంతో పాటు, ఆయన స్వయంగా తయారు చేసుకున్న ప్రత్యేక మైక్రో టూల్స్‌తో ఈ శిల్పాన్ని చెక్కారు. రంగుల కోసం గొంగళి పురుగు వెంట్రుకను బ్రష్‌గా ఉపయోగించడం విశేషం.
ఇది కూడా చదవండి: US Tariffs: నేటి నుంచి 50% సుంకాల భారం.. రొయ్యల, వజ్రాల పరిశ్రమకు పెద్ద దెబ్బ
వృత్తిరీత్యా స్వర్ణకారుడైన అజయ్, గతంలో బంగారం, ఏనుగు దంతం, అగ్గిపుల్లలు, నైలాన్ కణాలు వంటి అరుదైన పదార్థాలపై అనేక అద్భుతమైన శిల్పాలను రూపొందించారు. ఆయన కృషిని మాజీ ప్రధాన మంత్రులు పీవీ నరసింహారావు, అటల్ బిహారీ వాజ్‌పేయి, ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ సహా అనేక జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు అభినందించారు.
అజయ్ పేరు ఇప్పటికే లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఐదు జాతీయ, అంతర్జాతీయ రికార్డులతో నిలిచింది. అనేక పురస్కారాలు అందుకున్న ఆయన, ఇటీవల తన రచనలను వరల్డ్ ఆర్ట్ దుబాయ్ 2024లో ప్రదర్శించి మరోసారి ప్రపంచ దృష్టిని ఆకర్షించారు.
భారీ విగ్రహాలను ప్రతిష్ఠించే వినాయక చవితి సమయంలో అతి సూక్ష్మ పరిమాణంలో గణనాథుడిని ప్రతిష్ఠించడం ద్వారా అజయ్ కుమార్ తన భక్తిని, కళాప్రతిభను మరొకసారి నిరూపించుకున్నారు.



