MGM Warangal:అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన ఓ వ్యక్తి చనిపోయాడని ఆసుపత్రి సిబ్బంది చెప్పారు. మార్చురీలో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని అప్పగించారు. కుటుంబ సభ్యులు, బంధువులు దుఃఖభారంతో ఆ మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లి ఆఖరి కార్యక్రమాలు నిర్వహించే పనిలో పడ్డారు. తీరా అంత్యక్రియలు నిర్వహిస్తుండగా, ఆసుపత్రి మార్చురీలో చుట్టిన ప్యాక్‌ను విప్పిచూడగా, అవాక్కయ్యారు.
MGM Warangal:ఆ వ్యక్తి తమ కుటుంబ సభ్యుడి మృతదేహం కాదని, మరో వ్యక్తి మృతదేహాన్ని ప్యాక్ చేసి ఇచ్చారని ఆసుపత్రి సిబ్బందికి చెప్పేశారు. అంత్యక్రియలు ఆపారు. తమ పొరపాటేనని, మీ వ్యక్తి మృతదేహాన్ని తీసుకెళ్లాలని ఆసుపత్రి సిబ్బంది చెప్పగా, మళ్లీ వెళ్లిన వారికి ఓ విషయం తెలిసి అవాక్కవడం వారి వంతయింది.
MGM Warangal:వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం మైలారం గ్రామానికి చెందిన గోక కుమారస్వామి (50), రమ దంపతులు విభేదాలతో 20 ఏండ్ల క్రితం విడిపోయారు. రమ మైలారంలో ఉంటుండగా, కుమారస్వామి తొర్రూరులో ఉంటూ భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు. మూడు రోజుల క్రితం తొర్రూరులో ఓ రోడ్డుపై అపస్మారక స్థితిలో ఉన్న ఓ వ్యక్తిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. అతనే కుమారస్వామి అనుకొని ఆ మృతదేహాన్ని కుమారస్వామి కుటుంబ సభ్యులకు అప్పగించారు.
MGM Warangal:అంత్యక్రియలు చేస్తుండగా, కుమారస్వామి చేతిపై శ్రీ అనే పచ్చబొట్టు లేకపోవడంతో అది కాదని గమనించి కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆసుపత్రికి మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఆనవాళ్లు గుర్తించలేక మరో రోజు రావాల్సిందిగా ఆసుపత్రి సిబ్బంది చెప్పడంతో కుమారస్వామి కుటుంబ సభ్యులు ఇంటికి వెళ్లిపోయారు.
MGM Warangal:ఆసుపత్రి సిబ్బంది చెప్పినట్టుగా శనివారం (జూన్ 11) వెళ్లగా కుమారస్వామి కుటుంబ సభ్యులకు గుడ్‌న్యూస్ అందింది. కుమారస్వామి బతికే ఉన్నాడని, ఐడీ వార్డులో చికిత్స పొందుతున్నాడని సిబ్బంద తెలపడంతో సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. చనిపోయాడనుకున్న వ్యక్తి బతికే ఉండటంతో ఆయనను చూసి మురిసిపోయారు. దుఃఖభారాన్ని తగ్గించుకొని వైద్య చికిత్సలు చేయిస్తున్నారు.