Rain Alert: బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వర్షాలు పడనున్నాయి. దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా మీదుగా కొనసాగుతున్న ఈ ఆవర్తనం వల్ల రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని విశాఖపట్నం వాతావరణ కేంద్రం తెలిపింది.
ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్
రాబోయే 24 గంటల్లో విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
రేపు భారీ వర్షాలు పడే జిల్లాలు
అంతేకాకుండా, రేపు అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పు గోదావరి, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈదురు గాలులు
కోస్తాంధ్రలో రాగల ఐదు రోజులు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని, ఎల్లుండి నుంచి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు ఉంటాయని విశాఖపట్నం వాతావరణశాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. పాతపట్నంలో 7 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైనట్లు ఆయన చెప్పారు. ఇప్పటికే కురిసిన భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

