Honeymoon Murder Case

Honeymoon Murder Case: సోనమ్ ప్రధాన నిందితురాలు.. 790 పేజీల ఛార్జిషీట్..

Honeymoon Murder Case: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రాజా రఘువంశీ హత్య కేసు దర్యాప్తులో మేఘాలయ పోలీసులు కీలక మలుపు తిప్పారు. 2025 మే నెలలో జరిగిన ఈ ఘటనపై 790 పేజీల భారీ ఛార్జిషీట్‌ను సోహ్రా సబ్-డివిజన్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులో దాఖలు చేశారు. ఈ కేసులో రాజా భార్య సోనమ్ రఘువంశీతో పాటు ఆమె ప్రియుడు రాజ్ కుష్వాహా మరియు మరో ముగ్గురిపై హత్య అభియోగాలు మోపారు.

ఐదుగురు నిందితులపై హత్య ఆరోపణలు

ఛార్జిషీట్‌లో సోనమ్, రాజ్ కుష్వాహా, ఆకాష్ రాజ్‌పుత్, ఆనంద్ కుర్మి, విశాల్ సింగ్ చౌహాన్ పేర్లు ఉన్నాయి. వీరందరిపై IPC సెక్షన్ 103 (I) కింద హత్య, సెక్షన్ 238 (a) కింద నేరానికి సంబంధించిన సాక్ష్యాలను అదృశ్యం చేయడం, సెక్షన్ 61 (2) కింద నేరపూరిత కుట్ర ఆరోపణలు మోపారు. ప్రస్తుతం నిందితులంతా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

అదనపు ఛార్జిషీట్ త్వరలో

పోలీసులు తెలిపిన ప్రకారం, కేసులో మరో ముగ్గురిపై కూడా అనుబంధ ఛార్జిషీట్ దాఖలు కానుంది. వీరిలో ఆస్తి డీలర్ సిలోమ్ జేమ్స్, నేరం జరిగిన తర్వాత సోనమ్ దాక్కున్న భవనం యజమాని లోకేంద్ర తోమర్, ఆ ప్రాంత సెక్యూరిటీ గార్డు బల్బీర్ అహిర్‌బార్ ఉన్నారు. వీరిని ముందుగా అరెస్ట్ చేసినా ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు.

ఇది కూడా చదవండి: CM Revanth Reddy: కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి స్టాండయ్యారా? కుంప‌టి రాజుకుంటుందా? రెండోసారి సీఎం కామెంట్లపై గ‌ప్‌చుప్‌!

ప్రేమ వ్యవహారమే హత్యకు కారణం

సోనమ్ రఘువంశీ (24) ఇండోర్ వ్యాపారవేత్త రాజా రఘువంశీ (29)తో 2025 మే 11న వివాహం చేసుకుంది. వివాహం అనంతరం ఈ జంట హనీమూన్ కోసం మేఘాలయకు వెళ్లింది. అయితే సోనమ్‌కి అకౌంటెంట్ రాజ్ కుష్వాహాతో వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు దర్యాప్తులో తేల్చారు. రాజ్ వివాహితుడైనా సోనమ్‌తో సన్నిహితంగా మెలిగేవాడు. ఈ కారణంగానే భర్తను చంపేందుకు కుట్ర పన్నారు.

మే 23 అదృశ్యం – జూన్ 2 శవం కనుగొనడం

మే 23న రాజా, సోనమ్ అదృశ్యమయ్యారనే సమాచారం బయటకు రావడంతో పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చర్యలు చేపట్టారు. జూన్ 2న నోంగ్రియాట్ గ్రామం సమీపంలోని కొండల్లో రాజా మృతదేహం కనుగొనడంతో ఈ కేసు సంచలనం రేపింది. ఆ తర్వాత సోనమ్ ఆచూకీ దొరకకపోవడంతో అనుమానాలు మరింత పెరిగాయి.

జూన్ 8న సోనమ్ లొంగిపోవడం

జూన్ 8న సోనమ్ ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో లొంగిపోయింది. తరువాత దర్యాప్తులో ఆమె హత్యకు పాల్పడినట్టు అంగీకరించింది. రాజ్ కుష్వాహా, ఆకాష్, ఆనంద్, విశాల్ సహకారంతో భర్తను చంపినట్టు తెలిపింది. దేశవ్యాప్తంగా ఈ కేసు పెద్ద చర్చనీయాంశమైంది.

కుటుంబం తోడ్పాటు, సినిమా ప్రణాళిక

ఈ సంఘటన తర్వాత సోనమ్ సోదరుడు గోవింద్ కుటుంబం ఆమెతో అన్ని సంబంధాలు తెంచుకున్నట్లు ప్రకటించారు. రాజా కుటుంబానికి పూర్తి మద్దతు ఇస్తామని తెలిపారు. రాజా హత్య కేసు ఆధారంగా ఒక సినిమా కూడా తెరకెక్కుతోంది. త్వరలోనే ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *