మెగాస్టార్ చిరంజీవి మూడు వారాలుగా చికెన్ గున్యాతో బాధపడుతున్నారని తెలుస్తోంది . గిన్నెస్ వరల్డ్ రికార్డ్ లో చోటు సంపాదించుకున్న సందర్భంగా ఆదివారం (సెప్టెంబర్ 22) ఆయన గిన్నిస్ ఈవెంట్ లో పాల్గొన్నారు . బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరైన ఈ కార్యక్రమానికి చిరంజీవితో సినిమాలు నిర్మించిన ప్రముఖ నిర్మాతలు , దర్శకులు, మెగా కుటుంబ సభ్యులు పాల్గొన్నారు . అదేవిధంగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ద్వారా నిరంతరంగా రక్త దానం చేస్తూ వస్తున్న చిరంజీవి అభిమానులు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఆహ్వానాలు అందుకున్నారు . వీరందరి సమక్షంలో గిన్నిస్ ప్రతినిధి రిచర్డ్స్ , అమీర్ ఖాన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్ అందచేశారు .
అయితే , ఈ వేడుకలో చిరంజీవిని వేదిక మీదకు ఆహ్వానిస్తూ యాంకర్ ఒక షాకింగ్ విషయాన్ని వెల్లడించారు . 25 రోజులుగా చిరంజీవి చికెన్ గున్యాతో బాధపడుతున్నారని చెప్పారు . ఈ మధ్యకాలంలో ఆయన బయటకు వెళ్లలేదని . . గిన్నిస్ బుక్ రికార్డ్ సర్టిఫికెట్ తీసుకోవడం కోసం గిన్నిస్ ప్రతినిధుల ఆహ్వానంతో అక్కడకు వచ్చారని ఆమె అన్నారు . చిరంజీవిని వేదిక మీదకు పిలిచిన సందర్భంలో అమీర్ ఖాన్ , సాయి ధరమ్ తేజ్ చిరంజీవిని వేదిక మెట్లు ఎక్కడానికి సహకరించాల్సి వచ్చింది . ఈ విజువల్స్ చూసిన చిరంజీవి అభిమానులు ఆందోళన చెందుతున్నారు . చిరంజీవి త్వరగా కోలుకోవాలని వారంతా కోరుకుంటున్నారు . చిరంజీవి ఆరోగ్యంపై ఇది ఒకరకంగా అభిమానులకు షాకింగ్ విషయమేనని చెప్పాలి .