CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా ‘మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ (PTM) 2.0’ కార్యక్రమం ఘనంగా జరుగుతోంది. పుట్టపర్తిలోని కొత్తచెరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన ప్రధాన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాల్గొన్నారు. గురుపౌర్ణమి పవిత్ర దినాన ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం ద్వారా గురువులను, తల్లిదండ్రులను గౌరవించుకునే గొప్ప సంప్రదాయానికి నాంది పలికారు.
ఒకే రోజు రెండు కోట్ల మంది తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొనే ఈ మెగా సమావేశం (మెగా పీటీఎం-2.0) ఏపీ విద్యా రంగంలో ఒక సరికొత్త రికార్డును సృష్టించనుంది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్య కమిటీలు, ఇతర ఉద్యోగులు, అధికారులు, దాతలు, పూర్వ విద్యార్థులు.. ఇలా అందరినీ ఒకే వేదికపైకి తీసుకురావడం ఈ కార్యక్రమం ప్రత్యేకత.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులకు పాఠాలు బోధించారు. ‘వనరులు’ అనే అంశంపై విద్యార్థులతో ఆయనే స్వయంగా ముచ్చటించారు. కరెంటు, నీరు, విద్యుత్ ఉత్పత్తి, పునరుత్పాదక వనరులను ఎలా సద్వినియోగం చేసుకోవాలి, భవిష్యత్తు కోసం ఎలా ప్రణాళికలు వేసుకోవాలి అనే విషయాలపై విద్యార్థులకు వివరించారు. మంత్రి నారా లోకేష్ విద్యార్థులతో కలిసి పాఠాలు విన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు విద్యార్థుల ప్రోగ్రెస్ కార్డులను పరిశీలించి, వారి మార్కులపై ఆరా తీశారు.
Also Read: AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కామ్‌లో సంచలనం: మాజీ ఐఏఎస్ రజత్ భార్గవకు సిట్ నోటీసులు
CM Chandrababu: ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి నేరుగా విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులకు వివరించారు. పాఠశాల ఎలా ఉందని తల్లిదండ్రులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి సీఎం, మంత్రి లోకేష్ ఫోటోలు దిగారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పనితీరును సీఎం చంద్రబాబు ప్రశంసించారు, పాఠశాలల్లో ఆయన తెచ్చిన మార్పులను కొనియాడారు.
ఈ మెగా పేరెంట్-టీచర్ మీటింగ్ సందర్భంగా తల్లిదండ్రులకు పుష్పాలు ఇచ్చి, సీఎం పాదాభివందనం చేశారు. తల్లి పేరిట విద్యార్థులు పాఠశాలలో మొక్కలు నాటారు. పాఠశాలలోని అందరూ కలిసి సహపంక్తి భోజనం చేయడం ద్వారా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థుల మధ్య అనుబంధాలు, స్నేహపూర్వక వాతావరణం పెంపొందేలా చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసి, విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.