CM Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో విశాఖపట్నంలో జరుగుతున్న 30వ సీఐఐ (CII) భాగస్వామ్య సదస్సు రెండో రోజు కూడా ఉత్సాహంగా కొనసాగింది. ఈ కీలక సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రముఖ వస్త్ర తయారీ సంస్థ రేమాండ్ గ్రూప్ యొక్క మూడు ప్రధాన ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో రేమాండ్ గ్రూప్ ఎండీ గౌతమ్ మైనీ, మంత్రి టీజీ భరత్ తదితరులు పాల్గొన్నారు.
అనంతపురంలో రూ. 1,201 కోట్ల పెట్టుబడులు
రేమాండ్ గ్రూప్ ఏపీలో మొత్తం రూ. 1,201 కోట్ల భారీ పెట్టుబడులతో మూడు వేర్వేరు పరిశ్రమలను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టుల ద్వారా 6,500 మందికి ప్రత్యక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ మూడు యూనిట్లు అనంతపురం జిల్లాలో ఏర్పాటు కానున్నాయి:
సిల్వర్ స్పార్క్ అప్పారెల్ మాన్యుఫాక్చరింగ్ పార్క్: రాప్తాడులో రూ. 497 కోట్ల వ్యయంతో వస్త్ర పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు.
జేకే మైనీ గ్లోబల్ ఏరోస్పేస్ లిమిటెడ్: అనంతపురం జిల్లా టెకులోదు వద్ద రూ. 262 కోట్లతో ఏరోస్పేస్ పరికరాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ యూనిట్ దేశ రక్షణ, ఏరోస్పేస్ అవసరాలను తీర్చడం అభినందనీయమని సీఎం అన్నారు.
జేకే మైనీ గ్లోబల్ ప్రెసిషన్ లిమిటెడ్: అనంతపురం జిల్లాలోని గుడిపల్లిలో రూ. రూ. 441 కోట్ల పెట్టుబడితో రేమాండ్ గ్రూప్ ఒక ఆటో కాంపోనెంట్ తయారీ కేంద్రాన్ని స్థాపించనుంది.
రేమాండ్ గ్రూప్ ఇచ్చిన హామీ మేరకు, ఈ మూడు ప్రాజెక్టులను 2027 నాటికి ప్రారంభిస్తామని సీఎం తెలిపారు.
Also Read: Bihar News: ఆ ఇద్దరిలో బీహార్ ముఖ్యమంత్రి ఎవరు?
20 లక్షల ఉద్యోగాలు లక్ష్యం
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, తమ ప్రభుత్వం 18 నెలల్లోనే రూ. 20 లక్షల పెట్టుబడులను సాధించిందని, 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామన్న లక్ష్యాన్ని వచ్చే 3-4 ఏళ్లలోనే చేరుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
రాయలసీమ ప్రాంత పారిశ్రామికీకరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని సీఎం పునరుద్ఘాటించారు. ఈ ప్రాంతంలో ఇప్పటికే కియా మోటార్స్ ఉండగా, ఏరోస్పేస్, డిఫెన్స్ కారిడార్లు రానున్నాయి. రాయలసీమలో స్పేస్ సిటీ, డ్రోన్ సిటీలకు కూడా శంకుస్థాపన చేశారు. వీటితో పాటు, సోలార్, విండ్, పంప్డ్ స్టోరేజ్ వంటి పునరుత్పాదక ఇంధన పరిశ్రమలు, అలాగే బ్యాటరీ ఉత్పత్తి పరిశ్రమలు కూడా ఏర్పాటు కానున్నాయి.
విశాఖ.. ప్రపంచ డేటా సెంటర్‌గా
ప్రాంతీయ సమతుల్యతను కొనసాగిస్తూనే, విశాఖపట్నం నగరం త్వరలోనే ప్రపంచ డేటా సెంటర్‌గా మారనుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే, ప్రస్తుతం రాష్ట్రంలో పర్యాటకరంగం వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ రంగంలో కూడా భారీ పెట్టుబడులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.

