Medaram Maha Jatara: ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన మేళాగా గుర్తింపు పొందిన మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను వచ్చే ఏడాది వైభవోపేతంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిరిజన సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేస్తూ రూ.150 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ నిధులను జాతర ఏర్పాట్లతో పాటు మేడారంలో శాశ్వత నిర్మాణాలు, రహదారులు, తాగునీటి సదుపాయాలు, విద్యుత్, పారిశుధ్య సదుపాయాల అభివృద్ధికి వినియోగించనున్నారు.
ప్రతి రెండేళ్లకోసారి జరిగే ఈ మహా జాతరలో దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు ఈ మహా జాతర జరగనుంది. జనవరి 28న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరగా, జనవరి 29న సమ్మక్క తల్లి చిలకలగుట్ట నుంచి గద్దెలకు చేరుకుంటారు. జనవరి 30న భక్తులు పెద్ద ఎత్తున మొక్కులు చెల్లించుకోగా, జనవరి 31న అమ్మవార్ల వనప్రవేశంతో మహోత్సవం ముగియనుంది.
ఈ సారి మునుపెన్నడూ లేని రీతిలో నిధులు కేటాయించడంపై గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అట్లూరు లక్ష్మణ్‌కుమార్, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లూ భట్టి విక్రమార్కలకు మంత్రి సీతక్క కృతజ్ఞతలు తెలిపారు. “మేడారం మహా జాతర కోసం రూ.150 కోట్లు కేటాయించడం గిరిజనుల గౌరవానికి ప్రతీక. ఇది గిరిజనుల పట్ల సీఎం రేవంత్‌రెడ్డి చూపుతున్న కట్టుబాటు, మద్దతుకు నిదర్శనం. ఈ సారి జాతర మరింత గొప్పగా, చారిత్రాత్మకంగా జరుగుతుంది” అని ఆమె పేర్కొన్నారు.
ఇప్పటికే మేడారంలో ఏర్పాట్ల పనులు ప్రారంభమయ్యాయి. భారీ నిధుల కేటాయింపు, శాశ్వత వసతుల అభివృద్ధి, ఆధునిక సౌకర్యాలతో 2025 మేడారం మహా జాతర మరింత వైభవంగా సాగనుందని అధికారులు వెల్లడించారు.
