Medak: ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో యువతి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మెదక్ జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఉన్నత చదువులు చదివి, ఉద్యోగం సాధించి తమ కుటుంబానికి అండగా ఉంటుందని భావించిన యువతి తల్లిదండ్రులకు నిరాశ మిగిలింది.. ప్రేమ పెళ్లికి అంగీకరించలేదని ప్రాణాలు తీసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తాళ్లపల్లి తండాకు చెందిన ధనావత్ స్వరూప, కేశ్య నాయక్ దంపతుల కుమార్తె సక్కుబాయి (21), ఎంబీఏ పూర్తి చేసి గ్రూప్-2 ఉద్యోగానికి సిద్ధమవుతోంది. సక్కుబాయి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్న సమయంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ కానిస్టేబుల్‌తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. సక్కుబాయి ఈ విషయం ఇంట్లో చెప్పగా, కానిస్టేబుల్ వరుసకు అన్న అవుతాడని, పెళ్లి కుదరదని తల్లిదండ్రులు నిరాకరించారు.
తల్లిదండ్రుల నిరాకరణతో తీవ్ర మనోవేదనకు గురైన సక్కుబాయి ముభావంగా ఉండిపోయింది. ఇటీవల ఆమె తిరిగి హైదరాబాద్ వెళ్లి ఉద్యోగం చేస్తానని చెప్పగా, తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. దీంతో ఆమె మరింత కుంగిపోయింది. ఈ నెల 1న కుటుంబసభ్యులు పొలం పనులకు వెళ్లిన సమయంలో సక్కుబాయి ఇంట్లో గడ్డిమందు తాగింది. ఆ తర్వాత తన తండ్రికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పింది. వెంటనే ఇంటికి చేరుకున్న తల్లిదండ్రులు ఆమెను నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో గాంధీ ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ బుధవారం రాత్రి మరణించింది.
సక్కుబాయి మృతిపై ఆమె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఉన్నత భవిష్యత్తు ఉంటుందని ఆశించిన కూతురు ఇలా ప్రాణాలు కోల్పోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ప్రేమకు అడ్డుపడిన బంధుత్వమే ఈ విషాదానికి కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.