బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో టీజీఎస్ ఆర్టీసీ బస్సుల్లో టికెట్ ఛార్జీలు పెంచలేదని సంస్థ ఎండీ సజ్జనార్ క్లారిటీ ఇచ్చారు. ఈ విషయమై ఆయన ట్విట్టర్ లో ఒక పోస్టు చేశారు. టికెట్ ధరలు పెంచారన్న ప్రచారాన్ని ఆర్టీసీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. ‘ఛార్జీలు పెంచారనే వార్తల్లో వాస్తవం లేదు. ప్రధాన పండుగులైన సంక్రాంతి, దసరా, రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, ఉగాది, తదితర సమయాల్లో హైదరాబాద్ నుంచి ప్రయాణి కులు ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తుంటారు. ఈ సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను ఆర్టీసీ యాజమాన్యం నడుపుతుంది.
రద్దీ మేరకు హైదరాబాద్ సిటీ బస్సులను కూడా జిల్లాలకు తిప్పుతుంది. తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ ఉండకపోవడంతో ఖాళీగా ఆ బస్సులు వెళ్తుంటాయి. ఆ స్పెషల్ బస్సుల కు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీవో నంబర్ 16ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పండుగల సమయాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే రూ.1.50 వరకు టికెట్ ధరను సవరించుకునే వెసులుబాటును సంస్థకు ఇచ్చింది’ అని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు బతుకమ్మ, దసరాకు సొంతూళ్లకు వెళ్లిన ప్రయాణికుల నుంచి ముక్కు పిండి ఛార్జీలు వసూలు చేయడం దుర్మార్గమని హరీశ్ రావు మండిపడ్డారు. ‘సిద్దిపేట-జేబీఎస్ ఛార్జీ రూ.140 ఉంటే రూ.200 చేశారు. హన్మకొండ-హైదరాబాద్ సూపర్ లగ్జరీ టికెట్ రూ.300 ఉంటే రూ.420కు పెంచారు. బస్సుల సంఖ్య పెంచకుండా, టికెట్ ఛార్జీలు పెంచి తెలంగాణ ప్రజలకు పండుగ సంతోషాన్ని లేకుండా చేయడమేనా ప్రజాపాలన ముఖ్యమంత్రి గారు..?’ అని ట్వీట్ చేశారు.