Mavoist: ఒడిశా–ఝార్ఖండ్ సరిహద్దుల్లో మావోయిస్టులు పన్నిన భారీ విధ్వంస యత్నాన్ని భద్రతా దళాలు సమర్థవంతంగా భగ్నం చేశాయి. మావోయిస్టుల గూళ్లపై నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో సుమారు 2.5 టన్నుల పేలుడు పదార్థాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ సమాచారాన్ని ఓ సీనియర్ పోలీసు అధికారి మీడియాతో పంచుకున్నారు.
ఈ భారీ ఆపరేషన్‌లో ఒడిశా స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ (SOG), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF), ఝార్ఖండ్ జాగ్వార్ ఫోర్స్, సుందర్‌గఢ్ డిస్ట్రిక్ట్ వాలంటరీ ఫోర్స్ (DVF) కు చెందిన బలగాలు పాల్గొన్నారు.
పక్కా నిఘా సమాచారం మేరకు, మావోయిస్టులు ఒక రాతి గనికి తరలిస్తున్న పేలుడు పదార్థాలను మార్గమధ్యంలో దోచుకున్నట్టు అధికారులు గుర్తించారు. ఈ వార్తలపై వెంటనే స్పందించిన భద్రతా బలగాలు, మే 28వ తేదీ నుంచి ఐదు రోజుల పాటు అటవీ ప్రాంతాన్ని జల్లెడ పట్టి గాలించారు.
శ్రమ ఫలించి, చివరికి మావోయిస్టులు రహస్యంగా దాచిన 2.5 టన్నుల పేలుడు పదార్థాల నిల్వను గుర్తించి, వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ పదార్థాలు మావోయిస్టుల చేతుల్లో ఉండివుంటే, తీవ్ర విధ్వంసానికి దారితీసే ప్రమాదం ఉన్నదని భద్రతా అధికారులు పేర్కొన్నారు.
ఈ ఆపరేషన్ సందర్భంగా ఎటువంటి ఎదురుకాల్పులు జరగలేదు. మావోయిస్టులు ఆ సమయంలో అక్కడ లేకపోవడంతో, మొత్తం ఆపరేషన్ ప్రశాంతంగా ముగిసింది. స్వాధీనం చేసుకున్న పేలుడు పదార్థాలను భారీ భద్రత నడుమ సురక్షిత ప్రాంతాలకు తరలించినట్టు అధికారులు తెలిపారు.
ఈ విజయవంతమైన చర్యతో, మావోయిస్టుల కుట్రను ముందుగానే తిప్పికొట్టిన భద్రతా బలగాలు, మరోమారు తమ చాకచక్యాన్ని చాటిచెప్పాయి.