Tennessee Explosion: అమెరికా టెన్నెస్సీ రాష్ట్రం శుక్రవారం ఉదయం ఘోర దుర్ఘటనకు వేదికైంది. యుద్ధ సామాగ్రి తయారీకి ప్రసిద్ధి చెందిన ‘అక్యురేట్ ఎనర్జిటిక్ సిస్టమ్స్’ సంస్థ ప్లాంట్లో భారీ పేలుడు సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 7.45 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు తీవ్రత అంతగా ఉండటంతో, సమీపంలోని వాహనాలు ఎగిరిపడి మంటల్లో చిక్కుకున్నాయి. కొద్ది సేపట్లోనే ఆకాశాన్నంటిన మంటలు, దట్టమైన పొగతో ఆ ప్రాంతం మొత్తం కమ్ముకుంది.
భయంకర దృశ్యాలు.. మైళ్ల దూరం వరకు వినిపించిన పేలుడు శబ్దం
పేలుడు శబ్దం మైళ్ల దూరం వరకు వినిపించిందని స్థానికులు తెలిపారు. సమీపంలోని ఇళ్ల గోడలు కంపించాయి. రోడ్లపై పార్క్ చేసి ఉన్న వాహనాలు కదిలిపోయాయి. సీసీ కెమెరాల్లో రికార్డైన వీడియోల్లో ఆ పేలుడు దృశ్యాలు భయానకంగా కనిపిస్తున్నాయి. ఆ క్షణాల్లో ప్లాంట్ లోపల ఉన్న కార్మికులు పరుగులు పెట్టే సమయం కూడా లేకుండా మంటల్లో చిక్కుకున్నట్లు ప్రాథమిక సమాచారం చెబుతోంది.
19 మంది అచూకీ లభ్యం కాదు
ఈ దుర్ఘటన అనంతరం కనీసం 19 మంది అచూకీ లభ్యం కాలేదు. పేలుడు సమయంలో ప్లాంట్లో ఎంతమంది పనిచేస్తున్నారన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదని అధికారులు తెలిపారు. మంటలు తీవ్రంగా ఎగిసి పడుతుండటంతో రక్షణ బృందాలు లోపలికి చేరలేకపోతున్నాయి.
ఎఫ్బీఐ దర్యాప్తులోకి
పేలుడు సమాచారం అందిన వెంటనే ఎఫ్బీఐ అధికారులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. హంఫ్రీస్ కౌంటీ షెరీఫ్ క్రిస్ డేవిస్ మాట్లాడుతూ, “పేలుడుకు గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ప్రాథమికంగా మానవ తప్పిదమా, లేక సాంకేతిక లోపమా అన్నది పరిశీలిస్తున్నాం” అని తెలిపారు.
ఇది కూడా చదవండి: Nara Bhuvaneswari: నారా భువనేశ్వరికి అత్యంత ప్రతిష్టాత్మక అవార్డు
యుద్ధ సామాగ్రి తయారీ కేంద్రం
‘అక్యురేట్ ఎనర్జిటిక్ సిస్టమ్స్’ ప్లాంట్లో ప్రధానంగా మిలిటరీ కోసం పేలుడు పదార్థాల అభివృద్ధి, తయారీ, నిర్వహణ పనులు జరుగుతాయి. అందువల్ల అక్కడ నిల్వ ఉంచిన రసాయన పదార్థాల వల్లే ఈ భారీ పేలుడు సంభవించి ఉండొచ్చని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ప్రాంతంలో భయాందోళన
పేలుడు తర్వాత స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమీప పాఠశాలలు, వ్యాపార కేంద్రాలు మూసివేయబడ్డాయి. అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు స్థానిక ప్రభుత్వం రెస్క్యూ బృందాలను, అగ్నిమాపక సిబ్బందిని భారీ సంఖ్యలో అక్కడికి తరలించింది.
తరచూ జరుగుతున్న విషాదాలు
ఇటీవలి కాలంలో అమెరికాలో ఇలాంటి పారిశ్రామిక ప్రమాదాలు, కాల్పులు వరుసగా చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. విద్య, ఉపాధి కోసం అమెరికాకు వెళ్తున్న విదేశీ పౌరులు కూడా భద్రతా పరంగా అస్వస్థతను వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం అధికారులు గల్లంతైన వారి కుటుంబాలను సంప్రదిస్తూ, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ఘటన అమెరికా పరిశ్రమల భద్రతా ప్రమాణాలపై మళ్లీ ప్రశ్నలు లేవనెత్తింది.