Earthquake: జపాన్ దేశంలో మరోసారి బలమైన భూకంపం సంభవించింది. శనివారం (స్థానిక కాలమానం ప్రకారం) రాత్రి హోన్షు తూర్పు తీరానికి సమీపంలో భూమి ఒక్కసారిగా కంపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.0గా నమోదైనట్లు జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ), నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) వంటి సంస్థలు ధృవీకరించాయి.
భూకంపం వచ్చిన సమయంలో ఇళ్లు, కార్యాలయాలు, భవనాలలో ఉన్న ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ప్రాణాలను కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాల వైపు పరుగులు తీశారు. ఈ ప్రకంపనల ధాటికి పలు ప్రాంతాల్లో భవనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. కొన్ని చోట్ల ఆస్తినష్టం జరిగినట్లుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. అయితే, ప్రస్తుతానికి ప్రాణనష్టం గురించి స్పష్టమైన వివరాలు ఇంకా తెలియరాలేదు.
జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) ఇచ్చిన నివేదిక ప్రకారం, ఈ భూకంప కేంద్రం భూమి ఉపరితలం నుంచి సుమారు 10 నుంచి 50 కిలోమీటర్ల లోతులో ఏర్పడిందని అంచనా వేశారు. సాధారణంగా ఈ లోతులో కదలికలు సంభవించినప్పుడు భూకంప తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది.
భూకంపం సంభవించినప్పటికీ, తక్షణమే సునామీ వచ్చే ప్రమాదం లేదని సంబంధిత అధికారులు ప్రకటించారు. అయినప్పటికీ, పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉన్నందున జపాన్‌లో తరుచుగా ఇలాంటి భూకంపాలు సంభవించడం సాధారణమే. ఈ ప్రాంతంలో తక్కువ తీవ్రతతో ప్రకంపనలు, అప్పుడప్పుడు భారీ భూకంపాలు వస్తూ ఉంటాయి. క్షేత్రస్థాయిలో నష్టాన్ని అంచనా వేసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఆస్తి నష్టం, ఇతర వివరాలపై పూర్తి స్పష్టత రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.