Mock Drill: పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత భారత్–పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడంతో దేశవ్యాప్తంగా రక్షణ మాక్ డ్రిల్స్ నిర్వహించేందుకు కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మే 7, బుధవారం సాయంత్రం 4 గంటలకు, హైదరాబాద్ నగరంలో నాలుగు ప్రధాన ప్రాంతాల్లో – సికింద్రాబాద్, గోల్కొండ, కంచన్‌బాగ్ DRDO, మౌలాలి NFCలో భారీ స్థాయిలో “ఆపరేషన్ అభ్యాస్” పేరుతో మాక్ డ్రిల్ జరగనుంది.
ఈ డ్రిల్ సమయంలో నగరమంతా సైరన్లు మోగించనున్నారు. సైరన్ మోగగానే బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ప్రజలు వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. అలాగే, సైరన్ వినిపించే సమయంలో రెండు నిమిషాల పాటు విద్యుత్ పరికరాలు, గ్యాస్ స్టవ్‌లు ఆపివేయాలని, ప్రభుత్వ సూచిస్తుంది. పహల్గాం ఘటన తర్వాత దేశంలో ఉగ్రవాద విపత్తులు లేదా యుద్ధ పరిస్థితుల్లో ప్రజలు ఎలా స్పందించాలి, ఎలా వ్యవహరించాలి అనే అంశంపై అవగాహన కల్పించేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఈ చర్యలు చేపట్టింది.
హైదరాబాద్‌లో జరగనున్న డ్రిల్‌లో సివిల్ డిఫెన్స్, పోలీసులు, ఫైర్ సర్వీసులు, వైద్య బృందాలు, రెవెన్యూ, స్థానిక అధికారులు కలిసి పనిచేస్తారు. మొత్తం 12 సివిల్ డిఫెన్స్ సర్వీసులు ఇందులో భాగం అవుతున్నాయి. ఎయిర్ రైడ్ డ్రిల్, ప్రజలను సురక్షితంగా తరలించే ప్రాక్టీస్, ప్రథమ చికిత్స, మంటల నివారణ వంటి అంశాలపై సిబ్బందికి శిక్షణ ఇస్తున్నారు.
ఇది కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాదనే విషయం గుర్తించాలి. ఢిల్లీ, ముంబయి, చెన్నై, బెంగాల్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలలో కూడా 259 ప్రదేశాల్లో భారీ మాక్ డ్రిల్స్ జరుగనున్నాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో అన్ని జిల్లాల్లో, బెంగాల్‌లో 31 చోట్ల ఈ డ్రిల్స్ జరుగుతాయి.
Also Read: Hyderabad: గాలి జనార్దన్ రెడ్డికి 7 ఏళ్ళు జైలు శిక్ష
Mock Drill: ఈ నేపధ్యంలో ప్రధాని మోదీ త్రివిధ దళాధిపతులు రక్షణ శాఖ అధికారులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. పాకిస్థాన్‌పై వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకునే దిశగా కేంద్రం ముందుకు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసి, పాక్ విమానాలకు గగనతలాన్ని మూసివేసిన భారత్, మరిన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది.
ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకం. మాక్ డ్రిల్ జరగనున్న సమయంలో ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఒక రిహార్సల్ మాత్రమే. కానీ రేపు జరగవచ్చే ఏదైనా అత్యవసర పరిస్థితికి ముందుగానే సన్నద్ధంగా ఉండటం కోసం ప్రతి ఒక్కరూ ఇందులో భాగస్వాములవ్వాలి.