Marriage Event: మోసానికి కాదేదీ అనర్హం అని చెప్పుకోవాల్సిన రోజులివి. ఒకరకంగా కాదు ఎన్నిరకాలుగా వీలయితే అన్నిరకాలుగా మోసాలు చేయడం సర్వ సాధారణంగా మారిపోయింది. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉన్నా మోసగాళ్లు సరికొత్త ప్లాన్స్ వేసి ఊహించని విధంగా ఉచ్చులోకి లాగేస్తున్నారు. తాజాగా గుజరాత్ లోని రాజ్ కోట్ లో జరిగిన మోసం గురించి తెలిస్తే వామ్మో అనుకుంటారు!
Marriage Event: పెళ్లి గ్రాండ్ గా చేసుకోవాలని యువత కలలు కంటారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలకు పెళ్లివేడుకను అద్భుతంగ నిర్వహించాలని తహతహ లాడతారు. అప్పు చేసి అయినా సరే, వివాహ వేడుకను ఘనంగా జరిపించాలని అనుకుంటారు. మన దేశంలో పెళ్లి అనేది అతి పెద్ద ఈవెంట్ కింద లెక్క. పైగా బంధువులంతా వచ్చి చూసే వేడుక. వధూవరులను ఆశీర్వదించడానికి వచ్చిన బంధు మిత్రులు అంతా.. వేడుక ఎంత గ్రాండ్ గా ఉంది అనేది చెప్పుకుంటారు. అందుకే, పెళ్లి కోసం ఎక్కువ డబ్బు ఖర్చుపెట్టి ఆర్భాటాలు చేస్తూ ఉంటారు. సరిగ్గా.. ఇదే పాయింట్ మోసగాళ్లకు టార్గెట్ గా మారింది.
Marriage Event: మీ పిల్లల వివాహ వేడుకను గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తాం.. తక్కువ ఖర్చుతో అద్భుతమైన వివాహ వేడుక నిర్వహిస్తాం. మీరు చేయాల్సింది కొద్దిపాటి డబ్బు మాకు ఇవ్వడమే. మీరు మూహూర్తం సమయానికి మీ బంధుమిత్ర సపరివారంగా గ్రాండ్ వేదిక వద్దకు వచ్చి పెళ్లి తంతు జరిపించుకోవడమే.. మండపం నుంచి భోజనాల వరకూ.. పురోహితుల నుంచి తాళిబొట్టు వరకూ అన్ని మేమే చూసుకుంటాం అని ప్రచారం చేసారు కేటుగాళ్లు. ఇంకేముంది.. ఇదేదో బాగానే ఉంది కదా.. గ్రాండ్ గా పెళ్లి చేసుకోవచ్చు అని తలచిన వధూవరులు మోసగాళ్లు చెప్పిన మొత్తం చెల్లించేశారు. ఇక పెళ్లి కోసం బంధువులకు ఇన్విటేషన్స్ పంపేశారు.
Marriage Event: పెళ్లి రోజు రానే వచ్చింది. అందరూ వేదిక వద్దకు చేరుకున్నారు. అక్కడకు వెళ్ళాకా ఒక్కరికీ పరిస్థితి అర్ధం కాలేదు. పంతులు గారు వచ్చారు.. పూజా సామగ్రి లేదు. వేదిక ఉంది.. బాజా భజంత్రీలు లేవు. అంతెందుకు డబ్బులు తీసుకున్న ఈవెంట్ మేనేజర్ టీమ్ లో ఒక్కరు కూడా కనిపించలేదు. దీంతో అందరూ ఫోన్స్ చేశారు. కానీ, స్విచాఫ్. తాము మోసపోయాం అనే విషయాన్ని సుముహూర్తం సమయానికి అర్ధం చేసుకున్న వారంతా లబోదిబో మంటూ పోలీస్ స్టేషన్ కు పరుగులు తీశారు. కొందరు అయిందేదో అయింది.. మంచి ముహూర్తం కదా అని అక్కడే ఉన్న ఒక గుడిలో పెళ్ళితంతు కానిచ్చేశారు. మరికొందరికి పోలీసులు నచ్చచెప్పి పెళ్లి చేయించారు.
Marriage Event: ఇదంతా గుజరాత్ లోని రాజ్ కోట్ నగరంలో జరిగింది. వధూవరులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు రిజిస్టర్ చేసిన పోలీసులు ఈ ఘరానా మోసగాళ్ల కోసం వెతుకులాట మొదలు పెట్టారు. అదండీ సంగతి.. అప్రమత్తంగా ఉండకపోతే ఏదోవిధంగా మోసగాళ్లకు చిక్కుకుపోతాం. అందుకే, జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

