Maoist Party: మావోయిస్టు పార్టీ అగ్రనేత, పొలిట్‌బ్యూరో సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ (Mollojula Venugopal) సాయుధ పోరాటంపై, పార్టీ భవిష్యత్తుపై కీలకమైన ప్రకటన చేస్తూ పార్టీ క్యాడర్‌కు లేఖ రాశారు. తాను పార్టీ పొలిట్‌బ్యూరో బాధ్యతల నుంచి వైదొలగుతున్నట్లు ఆయన ప్రకటించారు. అనివార్య పరిస్థితుల కారణంగా పార్టీని వీడక తప్పడం లేదని పేర్కొన్నారు.
సాయుధ పోరాట విరమణకు పిలుపు
మల్లోజుల వేణుగోపాల్ తన లేఖలో పార్టీ క్యాడర్‌కు అత్యంత ముఖ్యమైన పిలుపునిచ్చారు. సాయుధ పోరాటాన్ని విరమించుకుని ఆయుధాలు వీడాలని ఆయన స్పష్టం చేశారు. ఈ నిర్ణయం పార్టీలో అంతర్గతంగా చర్చించిన తర్వాతే తీసుకోవాలని సూచించారు. అంతేకాకుండా, ఈ నిర్ణయం పార్టీ ప్రధాన కార్యదర్శి బతికున్నప్పుడే తీసుకున్నదేనని కూడా ఆయన పేర్కొన్నారు.
Also Read: Social Media Party YSRCP: వీకెస్ట్ అండ్ వరస్ట్ పార్టీ ఇన్ సోషల్‌మీడియా!
పార్టీ గతంలో చేసిన కొన్ని తప్పుల వల్ల తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని మల్లోజుల అంగీకరించారు. ఉద్యమం ఓటమి పాలు కాకుండా కాపాడలేకపోయామంటూ ఆయన క్షమాపణలు చెప్పుకొచ్చారు. ఇప్పటివరకు పార్టీ కొనసాగించిన పంథా పూర్తిగా తప్పిదమేనని ఆయన విమర్శించారు.
మల్లోజుల క్యాడర్‌కు ఉద్బోధిస్తూ, “తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవడం అనేది టీకా లాంటిది” అని సూచించారు. ప్రస్తుత ఫాసిస్టు పరిస్థితులలో తమ లక్ష్యాన్ని నెరవేర్చలేమని చెబుతూ, అనవసర త్యాగాలకు ఫుల్‌స్టాప్ పెట్టాలని, ముందుగా పార్టీ క్యాడర్‌ను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటారని ఆశిస్తున్నట్లు క్యాడర్‌కు తెలియజేశారు.