Maoist leader Sudhakar: మావోయిస్టు పార్టీకి మరోసారి పెద్ద దెబ్బ తగిలింది. బీజాపూర్ జిల్లాలోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీ నరసింహాచలం అలియాస్ సుధాకర్ మృతి చెందాడు. గత నెల రోజుల క్రితమే అగ్రనేత నంబాల కేశవరావు (కెశవన్నా) మృతి చెందగా, ఇప్పుడు సుధాకర్ మృతి మావోయిస్టు శిబిరంలో కలకలం రేపుతోంది.
భద్రతా దళాలకు సీనియర్ మావోయిస్టులు అటవీ ప్రాంతంలో ఉన్నారని సమాచారం లభించడంతో, డీఆర్‌జీ (DRG), ఎస్‌టీఎఫ్ (STF) బలగాలు అక్కడ భారీ గాలింపు చర్యలు ప్రారంభించాయి. తెల్లవారుజామున జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో సుధాకర్ మృతి చెందినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి. బీజాపూర్ ఎస్పీ డాక్టర్ జితేంద్ర యాదవ్ ఈ ఎన్‌కౌంటర్ జరగిందని ధృవీకరించినప్పటికీ, సుధాకర్ మృతిపై ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు.
సుధాకర్ మావోయిస్టు పార్టీలో గౌతమ్, ఆనంద్, చంటి బాలకృష్ణ రామరాజు, సోమన్న వంటి పేర్లతో ప్రసిద్ధి చెందాడు. ఆయన ఏలూరు జిల్లా చింతలపూడి మండలం ప్రగడవరం గ్రామానికి చెందినవాడు. సుదీర్ఘంగా — సుమారు నలభై ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో పాల్గొంటున్న సుధాకర్‌పై ప్రభుత్వం రూ. కోటి రివార్డు ప్రకటించింది. 2004లో ప్రభుత్వం నిర్వహించిన శాంతి చర్చల్లో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. బస్తర్ ఐజీ పి. సుందర్ రాజు ప్రకారం, ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో మరో ఇద్దరు కీలక మావోయిస్టు నాయకులు బండి ప్రకాశ్ మరియు పాపారావు కూడా ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం అందింది.
Also Read: Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖకు అస్వస్థత
Maoist leader Sudhakar: బండి ప్రకాశ్ – తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు, మాజీ ప్రెస్ ఇన్‌ఛార్జ్. నియామకాలు, ప్రచారం, దక్షిణ బస్తర్ కార్యకలాపాలు పర్యవేక్షిస్తున్నాడు. ఇతనిపై రూ. 25 లక్షల రివార్డు ఉంది. పాపారావు – స్పెషల్ జోన్ కమిటీకి చెందిన సీనియర్, ఐఈడీ బాంబుల తయారీలో నిపుణుడు. ఇతనిపై రూ. 20 లక్షల రివార్డు ఉంది. ఈ ఇద్దరి సంబంధించి స్పష్టమైన సమాచారం ఇంకా బయటకు రాలేదు. అయితే భద్రతా దళాలు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. బీజాపూర్ అటవీ ప్రాంతంలో పెద్ద మొత్తంలో ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం.
ఇటీవల జరిగిన వరుస ఎన్‌కౌంటర్లలో మావోయిస్టులు తీవ్రంగా బలహీనపడుతున్నారు. కేవలం ఆరు నెలల వ్యవధిలోనే ముగ్గురు కేంద్ర కమిటీ సభ్యులను భద్రతా దళాలు ఎన్‌కౌంటర్ చేయడం గమనార్హం. ఇటీవల నంబాల కేశవరావు మృతితో పాటు మరో 27 మంది మావోయిస్టులు మరణించగా, ఇప్పుడు సుధాకర్ మరణం మావోయిస్టు శక్తిని మరింత దెబ్బతీయనుంది. ఒక్క నెల వ్యవధిలోనే మావోయిస్టు పార్టీ రెండు కీలక నాయకులను కోల్పోవడం పార్టీకి గట్టి ఎదురుదెబ్బగా నిలిచింది. భద్రతా దళాలు ఎన్‌కౌంటర్‌ల ద్వారా పార్టీ అగ్రనాయకత్వాన్ని లక్ష్యంగా చేసుకుంటూ, ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు తహతహలాడుతున్నాయి.