Jawahar Reddy: భూమాతను కాపాడుకుంటేనే మానవాలికి మనుగడ ఉంటుందని ఆంద్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం అన్మాస్ పల్లి సమీపంలోని ఎర్త్ సెంటర్ లో కౌన్సిల్ఫర్ గ్రీన్ రెవల్యూషన్- తెలంగాణ పాఠశాల విద్యాశాఖ సంయుక్త ఆధ్వ ర్యంలో వ్యాయామ ఉపాధ్యాయులకు రెండు రోజుల పాటు శిక్షణ నిర్వహించారు. ‘స్కూల్ ఎర్త్ క్లబ్ యంగ్ ఎర్త్ లీడర్స్’ ఓరియంటేషన్ పోగ్రాం కు ఎపి మాజీ సీఎస్ హాజరయ్యారు. ఖమ్మం, నిజామాబాద్, మహబూబాబాద్ జిల్లాల నుంచి 80 మంది ఫిజికల్ డైరెక్టర్లతో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ ఉపాధ్యాయులు శిక్షణలో పాల్గొన్నారు.
కడ్తాల్ ఎర్త్ సెంటర్ లో సిజిఆర్ వ్యవస్థాపక అధ్యక్షులు లీలా లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో 14 ఏళ్లుగా సీజీఆర్ సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్న పర్యా వరణ కార్యక్రమాలను వివరించారు. ఏపి మాజీ సీఎస్ జవహర్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్ధి దశ నుంచే పర్యావరణాన్ని కాపాడే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. పర్యావరణ రక్షణ కార్యక్రమాల్లో యువత, విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రధాన భూమిక పోషించాల్సిన అవశ్యకత ఉందన్నారు. పర్యావరణ పరిర క్షణకు సీజీఆర్ సంస్థ చేపట్టిన కార్యక్రమం ఒక విశ్వ యజ్ఞమని అభినందించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.

