Manipur: ఏడాదిన్నరుగా మైయిటీ, కుకీ గోత్రాల మధ్య ఘర్షణలు కొనసాగుతున్న మణిపూర్‌లో గత వారం రాష్ట్రపతి పాలన విధించారు. సీఎం బీరెన్ సింగ్ రాజీనామా చేయడంతో పాటు కొత్త సీఎంగా ఎవరూ బాధ్యతలు స్వీకరించకపోవడంతో రాష్ట్రపతి పాలన అనివార్యమైంది. రాష్ట్రపతి పాలన అమలైన తొలి వారంలోనే భద్రతా బలగాలు ఉగ్రవాద, తీవ్రవాద గ్రూపులపై కఠిన చర్యలు తీసుకుంటూ భారీ ఆపరేషన్లు నిర్వహించాయి.
కేవలం వారం రోజుల్లోనే భద్రతా బలగాలు 30 మందికి పైగా తిరుగుబాటు గ్రూపుల సభ్యులను అరెస్ట్ చేశాయి. అరెస్టయిన వారిలో పలువురు ఉగ్రవాద సంస్థల సీనియర్ నాయకులు కూడా ఉన్నారు. అలాగే అనేక గ్రామ వాలంటీర్లను అదుపులోకి తీసుకున్నారు. దీనివల్ల ఇంఫాల్ సహా అనేక ప్రాంతాల్లో నిరసనలు చెలరేగాయి.
అరెస్టయిన ఉగ్రవాదులు కాంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (KCP), పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (PLA), PREPAK, KYKL, కుకి నేషనల్ ఆర్మీ (KNA), యునైటెడ్ నేషనల్ కుకి ఆర్మీ (UNKA) వంటి మిలిటెంట్ గ్రూపులకు చెందినవారిగా గుర్తించారు. భద్రతా బలగాలు నిర్వహించిన ఆపరేషన్లలో కనీసం 15 ఐఈడీ బాంబులు, హెచ్‌కే రైఫిల్స్, ఇన్సాస్ రైఫిల్స్, ఏకే సిరీస్ గన్లు, ఆటోమేటిక్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఆపరేషన్‌లో కాక్చింగ్ జిల్లాలో 10 మందికి పైగా గ్రామ వాలంటీర్లను అరెస్ట్ చేశారు. రాష్ట్రపతి పాలన అమలులోకి రావడంతో మణిపూర్ పాలనను కేంద్రం నేరుగా తీసుకుని, పారామిలిటరీ దళాలను వేగంగా మోహరించింది. తిరుగుబాటుదారుల కదలికలను నిరోధించేందుకు రహదారులు, ముఖ్య మార్గాల్లో భద్రతా తనిఖీలు ప్రారంభించారు. రాత్రి సమయంలో సెర్చ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు.
చట్టవిరుద్ధంగా ఆయుధాలు కలిగి ఉన్నవారు లేదా దోపిడీ చేసిన వారు 7 రోజుల్లో స్వచ్ఛందంగా లొంగిపోవాలని గవర్నర్ అజయ్ కుమార్ భల్లా హెచ్చరించారు. గడువు ముగిసిన తర్వాత కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీనిపై నిరసనగా ఇంఫాల్ తూర్పు, ఇంఫాల్ పశ్చిమ, తౌబాల్, కాక్చింగ్ జిల్లాల్లో భారీ ప్రదర్శనలు జరిగాయి. నిరసనకారులు రోడ్డు పక్కన ఉన్న దుకాణాలను బలవంతంగా మూయించారు.

