Manikam tagore: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS)పై కాంగ్రెస్ ఎంపీ మాణికం ఠాగూర్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపాయి. ఆరెస్సెస్‌ను అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఈ వ్యాఖ్యలపై పరువునష్టం దావా వేయడానికి కూడా వెనుకాడబోమని బీజేపీ హెచ్చరించింది.
వివరాల్లోకి వెళితే, మాణికం ఠాగూర్ మాట్లాడుతూ, “ఆరెస్సెస్ ఒక విద్వేషపూరిత సంస్థ. అది సమాజంలో విద్వేషాన్ని వ్యాప్తి చేస్తుంది. ఆ సంస్థ నుంచి నేర్చుకోవాల్సింది ఏమీ లేదు. అల్ ఖైదా ఎలా రక్తపాతంతో పనిచేస్తుందో, అదే విధంగా దేశంలో ఆరెస్సెస్ కూడా విద్వేషాన్ని పెంపొందిస్తూ పనిచేస్తోంది” అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
ఆరెస్సెస్ సంస్థాగత బలాన్ని ప్రశంసిస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన సోషల్ మీడియా పోస్టుకు ప్రతిస్పందనగా ఠాగూర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు అగ్రనేతల పాదాల వద్ద కూర్చున్న క్షేత్రస్థాయి కార్యకర్త కూడా (నరేంద్ర మోదీ) ప్రధాని కాగలగడం ఆరెస్సెస్ సంస్థాగత శక్తికి నిదర్శనమని దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.
ఈ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ఆర్.పి. సింగ్ ఘాటుగా స్పందించారు. “మాణికం ఠాగూర్ మాట్లాడే ముందు పదిసార్లు ఆలోచించుకోవాలి. బాధ్యతలేని వ్యాఖ్యలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. అవసరమైతే పరువునష్టం దావా కూడా వేస్తాం” అని హెచ్చరించారు.
దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను సమర్థించిన ఆర్.పి. సింగ్, బీజేపీలో సామాన్య కార్యకర్త కూడా ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి స్థాయికి ఎదగగలడని అన్నారు. అయితే కాంగ్రెస్‌లో మాత్రం సోనియా, రాహుల్, ప్రియాంక అనే ఒకే కుటుంబం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయని విమర్శించారు. కాంగ్రెస్‌కు ప్రజల ముందు ఉంచేందుకు సరైన విధానాలు గానీ, విశ్వసనీయ నాయకత్వం గానీ లేదని ఆయన ఎద్దేవా చేశారు
ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్–బీజేపీ మధ్య రాజకీయ వాగ్వాదం మరింత తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
