Manchu Vishnu: మోహన్ బాబు యూనివర్సిటీ ఫీజుల వివాదం

Manchu vishnu: మోహన్ బాబు యూనివర్సిటీపై వస్తున్న అధిక ఫీజుల వసూలు ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని సినీ నటుడు మంచు విష్ణు స్పష్టం చేశారు. విద్యార్థుల నుంచి తాము ఎలాంటి అదనపు ఫీజులు వసూలు చేయలేదని, అకడమిక్ ఇయర్ నిబంధనల ప్రకారమే ఫీజులు స్వీకరించామని ఆయన తెలిపారు. తమ విద్యాసంస్థ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు జరుగుతున్న ప్రచారాన్ని, నిరాధారమైన వార్తలను ప్రజలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

అయితే, మంచు విష్ణు వివరణకు పూర్తి భిన్నంగా ఉన్నత విద్యా కమిషన్ నివేదిక ఉండడం గమనార్హం. మోహన్ బాబు యూనివర్సిటీలో గత మూడేళ్లుగా విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో సుమారు రూ.26 కోట్లు అదనంగా వసూలు చేశారని కమిషన్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందాయి.

ఈ అంశంపై లోతుగా విచారణ చేపట్టిన కమిషన్, ఆరోపణలు వాస్తవమేనని నిర్ధారించింది. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను యూనివర్సిటీకి రూ.15 లక్షల జరిమానా విధిస్తూ ఉన్నత విద్యా కమిషన్ నిర్ణయం తీసుకుంది.

అంతేకాకుండా, విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన రూ.26 కోట్లను 15 రోజుల్లోగా తిరిగి చెల్లించాలని కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో మోహన్ బాబు యూనివర్సిటీ గుర్తింపును రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ సిఫారసు చేయడం విద్యా వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఒకవైపు కమిషన్ కఠిన చర్యలకు ఉపక్రమించడం, మరోవైపు యాజమాన్యం ఆరోపణలను తోసిపుచ్చడంతో ఈ వివాదం మరింత ముదిరినట్లయింది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *