ఏపీ వరద బాధితులకు అండగా నిలిచేందుకు మంచు ఫ్యామిలీ రూ.25 లక్షలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా మంచు మోహన్ బాబు, విష్ణు స్వయంగా సీఎం చంద్రబాబుకు చెక్ అందించారు. ఈ సందర్భంగా తాను స్వయంగా గీసిన చంద్రబాబు చిత్రాన్ని సీఎంకు అందించినట్లు విష్ణు తెలిపారు. దానిపై ఆయన తన ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నట్లు పేర్కొన్నారు. తాను నటిస్తోన్న ‘కన్నప్ప’ సినిమా గురించి వివిధ విషయాల గురించి ఆయన అడిగినట్లు ట్వీట్ చేశారు.
కాగా ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాలకు చాలా ప్రాంతాలు అతలాకుతలమైయ్యాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలకు చేయూతనందించేందుకు పలువురు సినీ ప్రముఖులు ముందుకు వచ్చారు. భారీ మొత్తంలో విరాళాలు ప్రకటించారు. అందులో భాగంగా ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు మంచు మోహన్ బాబు రూ.25 లక్షలు విరాళంగా ఇస్తానని ప్రకటించారు. అందుకు సంబంధించిన చెక్కును తాజాగా ఆయన సీఎంను కలిసి అందజేశారు.
ఇక కన్నప్ప సినిమా విషయానికి వస్తే…. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. విష్ణు మంచు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే పూర్తి చేసి.. ఒకవైపు ప్రమోషన్ కార్యక్రమాలు, మరోవైపు నిర్మాణానంతర కార్యక్రమాలు స్టార్ట్ చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్న ఈ విజువల్ వండర్‌ను డిసెంబర్‌లో పాన్ ఇండియాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

