Hyderabad: తనకోపమే తన శత్రువు అని ఎవరైనా చెబితే విని ఊరుకుంటాం. కానీ, కోపం ఎంత కొంప ముంచుతుందో తెలిపే సంఘటనలు ఒక్కోసారి మనల్ని ఉలిక్కిపడేలా చేస్తాయి. కోపం ఎంత కొంప ముంచుతుందో.. అతి ప్రేమ కూడా అంతే ప్రమాదాన్ని తెచ్చిపెడుతుంది. ఈ రెండూ కలగలిస్తే ఇదిగో ఇలా పాపం ఈయనలా జైలు పాలు కావాల్సి వస్తుంది.
అవును తన బిడ్డ మీద అతిప్రేమ.. మూగజీవి మీద వచ్చిన కోపం హైదరాబాద్ లో ఒక వ్యక్తిని కటకటాల పాలు చేసింది. వివరాల్లోకి వెళితే, గోషామహల్ షాయినాయత్గాంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల ఓ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జుమ్మేరాత్ బజార్లోని దేవీనగర్ లో మల్లమ్మ అనే మహిళ ఇంట్లో కుక్కను పెంచుకుంటోంది. అదే ఇంట్లో కింది అంతస్తులో సత్యనారాయణ అనే వ్యక్తి కుటుంబంతో సహా నివాసం ఉంటున్నాడు. దీపావళి సందర్భంగా సత్యనారాయణ కుమారులు టపాసులు కాలుస్తూ.. మల్లమ్మ పెంచుకుంటున్న కుక్కపైకి వాటిని విసిరారు. దీంతో ఆ కుక్క సత్యనారాయణ కొడుకును కరించింది.
ఇది కూడా చదవండి : బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడుతున్న వారి అరెస్ట్
Hyderabad: కుక్క తన కొడుకును కరిచింది అని తెలియగానే సత్యనారాయణ ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆ కుక్కను పట్టుకుని ఇనుపరాడ్డుతో చితకబాదాడు. తరువాత రెండో అంతస్తు నుంచి ఆ కుక్కను విసిరి పారేశాడు. దీంతో పాపం ఆ కుక్క అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
కుక్కను చంపేయడంతో సత్యనారాయణపై ఆగ్రహం చెందిన మల్లమ్మ కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కుక్కను చంపిన సత్య నారాయణను అరెస్టు చేసి సెక్షన్ 325 యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.
అదండీ విషయం. తన పిల్లలపై ప్రేమ.. వారిని కరిచింది కుక్కపై వచ్చిన విపరీతమైన కోపం సత్యనారాయణను ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో కూచోపెట్టింది.