Hyderabad

Hyderabad: అత్తాపూర్‌లో జింక మాంసం విక్రయం.. నిందితుడి అరెస్ట్

Hyderabad: హైదరాబాద్‌ నగరంలోని అత్తాపూర్‌లో జింక మాంసం విక్రయిస్తున్న వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేమాన్ నగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా జింక మాంసాన్ని అమ్ముతున్నారన్న సమాచారంతో ఎస్‌వోటీ (SOT) పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో ఇర్ఫానుద్దీన్ అనే వ్యక్తి పట్టుబడగా, అతని వద్ద ఉన్న మాంసాన్ని చూసి పోలీసులు షాక్‌కు గురయ్యారు.

పోలీసులు నిందితుడి నుంచి సుమారు 15 కిలోల జింక మాంసంతో పాటు, జింక చర్మం, తలను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు అతని వద్ద ఉన్న 3,500 రూపాయల నగదును కూడా సీజ్ చేశారు. పట్టుబడిన మాంసం జింకదేనని నిర్ధారించుకున్న పోలీసులు, నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు ఈ మాంసాన్ని ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా పెబ్బేరు ప్రాంతం నుంచి నగరానికి తీసుకువచ్చినట్లు ఒప్పుకున్నాడు. ఇక్కడ కిలో జింక మాంసాన్ని 800 రూపాయలకు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వన్యప్రాణులను వేటాడటం, వాటి మాంసాన్ని అమ్మడం నేరం కావడంతో, నిందితుడిపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *