Mallu Ravi: కాంగ్రెస్ పార్టీలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ లోపలే చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా పదేళ్లు కొనసాగుతానన్న రేవంత్ వ్యాఖ్యలపై స్పందించిన పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి, పార్టీ నేతలు సంయమనం పాటించాలని సూచించారు. ముఖ్యమంత్రిపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ అధిష్ఠానం తగిన నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. పార్టీకి సంబంధించిన విషయాలను బహిరంగంగా మాట్లాడకూడదని నేతలకు హితవు పలికారు.
రేవంత్ రెడ్డి ఏ సందర్భంలో ఆ పదేళ్ల వ్యాఖ్య చేశారు అన్న విషయం రాజగోపాల్ రెడ్డికి తెలియకపోవచ్చని మల్లు రవి అభిప్రాయపడ్డారు. మరోవైపు బీఆర్ఎస్ నేత కేటీఆర్‌పై ఆయన ఘాటుగా విమర్శలు చేశారు. ముఖ్యమంత్రిపై కేటీఆర్ మితిమీరిన వ్యాఖ్యలు చేస్తున్నారని, అలాంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ కార్యకర్తలు గట్టిగా ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు.
ఇటీవల రేవంత్ రెడ్డి ఒక సభలో “మరో పదేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగుతాను” అని చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపాయి. ఈ వ్యాఖ్యలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా స్పందిస్తూ, ఇవి కాంగ్రెస్ విధానాలకు విరుద్ధమని అన్నారు. పార్టీని వ్యక్తిగత సామ్రాజ్యంగా మలచే ప్రయత్నాలను కార్యకర్తలు సహించరని ఆయన ‘ఎక్స్’ వేదికగా వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలోనే మల్లు రవి తాజా ప్రకటన వచ్చింది.