Malla Reddy: సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో సందడి మామూలుగా ఉండదు. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఇంటి ముంగిట రంగురంగుల ముగ్గులు మెరుస్తుంటాయి. తాజాగా మేడ్చల్ నియోజకవర్గంలో నిర్వహించిన ముగ్గుల పోటీల్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి తనదైన శైలిలో పాల్గొని అందరి దృష్టిని ఆకర్షించారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, ప్రజలతో కలిసిపోయి సరదాగా గడపడంలో మల్లారెడ్డి ఎప్పుడూ ముందుంటారని ఆయన మరోసారి నిరూపించారు.
మేడ్చల్ పరిధిలోని పూడూరు – కిష్టాపూర్ డివిజన్ కె.ఎల్.ఆర్ ప్రాంతంలో బీఆర్ఎస్ నాయకుడు ఆకిటి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళల కోసం భారీగా ముగ్గుల పోటీలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మల్లారెడ్డి, అక్కడ ఉన్న పండుగ వాతావరణాన్ని చూసి ఎంతో ఉత్సాహపడ్డారు. కేవలం అతిథిగా వచ్చి వెళ్ళిపోకుండా, పోటీలో పాల్గొన్న మహిళలను ప్రోత్సహిస్తూ వారిలో జోష్ నింపారు.
ఈ సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఎప్పుడూ తన పంచ్ డైలాగులతో అందరినీ నవ్వించే మల్లారెడ్డి, ఈసారి ముగ్గు పిండి పట్టుకుని స్వయంగా రంగంలోకి దిగారు. నేలపై వంగి స్వయంగా ముగ్గు వేసి అక్కడ ఉన్న వారందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. ఎమ్మెల్యే ముగ్గు వేయడం చూసిన మహిళలు, స్థానిక నాయకులు పెద్ద ఎత్తున చప్పట్లు కొడుతూ కేరింతలు కొట్టారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ.. సంక్రాంతి మన సంప్రదాయాలకు అద్దం పట్టే పండుగ అని కొనియాడారు. ఆడపడుచులందరూ తమ సృజనాత్మకతను చూపించడానికి ఇటువంటి ముగ్గుల పోటీలు మంచి వేదికలని ఆయన అభిప్రాయపడ్డారు. నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆయన మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేసి, వారితో కలిసి ఫోటోలు దిగి సందడి చేశారు.
