Fahadh Faasil: మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ తన రిటైర్‌మెంట్ ప్లాన్ గురించి మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను నటన నుంచి రిటైర్ అయిన తర్వాత బార్సిలోనాలో ఉబర్ డ్రైవర్‌గా మారాలని తన కల అని ఇటీవల ‘ది హాలీవుడ్ రిపోర్టర్ ఇండియా’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఫహాద్‌కు డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం. రిటైర్‌మెంట్ తర్వాత బార్సిలోనాలో ఉబర్ డ్రైవర్‌గా పనిచేయడం తన కల అని, మనుషులను వారి గమ్యస్థానాలకు చేర్చడం తనకు మంచి అనుభూతిని ఇస్తుందని తెలిపారు. ఇది చాలా “అందమైన ఆలోచన” అని ఆయన అభివర్ణించారు. ఈ ఆలోచనను ఫహాద్ ఐదేళ్ల క్రితం, అంటే 2020లో తన ‘సీ యూ సూన్’ సినిమా ప్రమోషన్ల సమయంలోనే తొలిసారి పంచుకున్నారు. ఐదేళ్ల తర్వాత కూడా అదే ఆలోచనపై ఉన్నానని, అది తనకు మరింత స్పష్టతను ఇస్తుందని చెప్పారు.
Also Read: HHVM Part 2: హరిహర వీరమల్లు 2 కండిషన్స్ అప్లై?
స్టార్‌డమ్‌కు దూరంగా, ప్రశాంతమైన, సాధారణ జీవితాన్ని గడపాలని ఆయన కోరుకుంటున్నారు. డ్రైవింగ్ చేయడం తన వ్యక్తిగత సమయమని, ఆలోచించడానికి అది తనకు చాలా సహాయపడుతుందని అన్నారు. తన భార్య నజ్రియా నజీమ్‌కు కూడా ఈ రిటైర్‌మెంట్ ప్లాన్ నచ్చిందని ఫహాద్ వెల్లడించారు. తాను బార్సిలోనాకు వెళ్లి స్పెయిన్ అంతా డ్రైవ్ చేస్తానని ఆమెతో చెప్పినప్పుడు ఆమె ఈ ప్లాన్‌ను ఇష్టపడిందని చెప్పారు. రిటైర్మెంట్ ఎప్పుడు తీసుకుంటారని అడిగినప్పుడు, “ప్రేక్షకులకు నేను బోర్ కొట్టనంతవరకు ఇది జరగదు. నేను చెడ్డ సినిమాలు చేయడం మొదలుపెడితే, అప్పుడే ప్రజలు నన్ను వదిలేస్తారు. నా ప్రయత్నం నిజాయితీగా ఉందని నేను నమ్మినంతవరకు, వారు నన్ను దగ్గర ఉంచుకోవాలనుకుంటారు” అని చమత్కరించారు.

