Crime News: మలక్‌పేటలో సీపీఐ రాష్ట్ర నాయకుడు చందు నాయక్ (అలియాస్ చందు రాథోడ్, 50) హత్య కేసు కలకలం సృష్టిస్తోంది. శాలివాహననగర్ పార్క్‌లో ఉదయం వాకింగ్ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా, గుర్తు తెలియని దుండగులు కళ్లలో కారం చల్లి అతనిపై ఎనిమిది రౌండ్ల పాటు కాల్పులు జరిపారు. చందు నాయక్ అక్కడికక్కడే రక్తపు మడుగులో కుప్పకూలి మృతి చెందాడు.
ఎనిమిది రౌండ్ల కాల్పులు – ఐదుగురు ఇంకా పరారీలోనే
పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు మొత్తం 9 మందిని గుర్తించి, అందులో 4 మందిని అరెస్ట్ చేశారు. వారే నేరుగా కాల్పులు జరిపినట్టు పోలీసులు చెబుతున్నారు. మిగిలిన 5 మంది సహకరించిన నిందితులు ఇంకా పరారీలోనే ఉన్నారు.
ఇది కూడా చదవండి: YS Jagan: సూపర్ సిక్స్ హామీలపై జగన్ విమర్శలు
వారిని పట్టుకునేందుకు 10 ప్రత్యేక బృందాలు గాలింపు కొనసాగిస్తున్నాయి. పోస్టుమార్టం నివేదిక ప్రకారం చందు శరీరంలో 5 బుల్లెట్లు దొరకగా, ఘటనా స్థలంలో మరో 3 బుల్లెట్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
హత్య వెనుక భూ వివాదాలేనా?
పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ హత్యకు భూ వివాదాలే ప్రధాన కారణమని తేలుతోంది. చందు నాయక్ గతంలో కూడా భూ వివాదాల్లో భాగస్వామిగా ఉన్నట్టు సమాచారం. అదనంగా, వివాహేతర సంబంధం కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.కాల్పుల తర్వాత నిందితులు చౌటుప్పల్ వైపు పారిపోయినట్లు సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు నిర్ధారించారు.