Tirumala: తిరుమల తిరుపతి దేవస్థానంలో మరో పెద్ద స్కాం బట్టబయలైంది. శ్రీవారి సేవలో ఉపయోగించే పట్టు శాలువాల కొనుగోళ్లపై పెద్ద మోసం వెలుగులోకివచ్చింది. పవిత్రతకు, భక్తిభావానికి నిలువుటద్దంలా.. భావించే తిరుమల క్షేత్రంలో వరుస స్కామ్‌లు ఆందోళన కలిగిస్తున్నాయి. పట్టు వస్త్రాల్లో అసలు పట్టు లేదనే వాస్తవం విజిలెన్స్ పరీక్షల్లో బయటకు రావడంతో టీటీడీని కలవరపరిచింది. టెండర్ నిబంధనల ప్రకారం స్వచ్ఛమైన మల్బరీ పట్టు ఉండాల్సిందిపోయి, పూర్తిగా పాలిస్టర్‌తో తయారు చేసిన శాలువాలను సరఫరా చేసినట్లు నిర్ధారణ అయింది. దీంతో టీటీడీ ధర్మకర్తల మండలి ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఏసీబీకి ఆదేశాలు పంపించింది.
నగరి సమీపంలోని వీఆర్‌ఎస్ ఎక్స్‌పోర్ట్స్ అనే సంస్థకు టీటీడీకి పట్టు శాలువాలు అందించే బాధ్యత అప్పగించారు. ఒక్కో శాలువా ధర రూ.1,389.15గా నిర్ణయించగా, 2015 నుంచి 2025 వరకు ఈ సంస్థతోపాటు దాని అనుబంధ యూనిట్ల నుంచి టీటీడీ దాదాపు రూ.54.95 కోట్ల విలువైన వస్త్రాలు కొనుగోలు చేసినట్లు రికార్డులు వెల్లడిస్తున్నాయి. కానీ తాజా స్టాక్‌పై అనుమానాలు రావడంతో విజిలెన్స్ అధికారులు తిరుమల–తిరుపతి గోదాముల నుంచి నమూనాలు తీసి బెంగళూరు, ధర్మవరంలోని సెంట్రల్ సిల్క్ బోర్డులకు పంపారు. రెండు ల్యాబ్స్ కూడా స్పష్టంగా “ఇవి పట్టు కాదు… 100% పాలిస్టర్” అని నివేదిక ఇచ్చాయి. శాలువాలపై ఉండాల్సిన ‘సిల్క్ హోలోగ్రామ్’ కూడా లేకపోవడం మరో ముఖ్య అంశంగా పరిగణనలోకి తీసుకున్నారు.
ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయమేమంటే, గతంలో ఇదే స్టాక్ నుంచి డిప్యూటీ ఈవో పంపిన నమూనాలు కాంచీపురం ల్యాబ్‌లో పరీక్షించగా పట్టు వేనన్న రిపోర్టు వచ్చింది. ప్రస్తుతం విజిలెన్స్ చేసిన పరీక్షల్లో మాత్రం పాలిస్టర్‌గా తేలడంతో, ల్యాబ్ రిపోర్టులు మార్చేయడమో, లేదా నివేదికలు తారుమారు చేయడమో జరిగాయా అన్న అనుమానాలు విజిలెన్స్ నివేదికలో స్పష్టం చేసింది.
Also Read: Local Elections: స్థానిక ఎన్నికల వేళ కలకలం.. కారులో భారీగా నగదు పట్టివేత!
టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తాజా బోర్డు సమావేశంలో ప్రస్తుత టెండర్‌ను వెంటనే రద్దు చేయాలని, కాంట్రాక్టర్‌పై క్రిమినల్ కేసులు పెట్టాలని నిర్ణయం తీసుకున్నారు. 2019 నుంచి ఇప్పటి వరకు రూ.80–90 కోట్ల మేర అవినీతి జరిగి ఉండొచ్చని కూడా ఆయన తెలిపారు. శుద్ధమైన తుస్సా పట్టు, బంగారు–వెండి జరీ, సిల్క్‌మార్క్ ధ్రువీకరణ ఉండాల్సిన చోట నాసిరకం వస్త్రాలతో భక్తులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా తీవ్రంగా స్పందించారు. టీటీడీలో చాలా ఏళ్లుగా కొంతమంది తమ ఇష్టానుసారంగా వ్యవహరించారని, శాలువాల కుంభకోణం ఈ వ్యవస్థలో ఉన్న లోపాలను మరోసారి బయటపెట్టిందని అన్నారు. ఏసీబీ విచారణ ప్రారంభమైందని, వాస్తవాలు బయటకు వచ్చిన వెంటనే చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా జరిగిన ఈ మోసంపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
భక్తులకు ప్రసాదించే ఈ పట్టు శాలువాలను ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఒక్కసారైనా శ్రీవారి శాలువా మెడలో వేసుకోవాలని అనుకునే వేలాది మంది భక్తుల విశ్వాసాన్ని, మనోభావాలను ఈ స్కామ్ తీవ్రంగా దెబ్బతీసింది. ప్రస్తుతం టీటీడీ వద్ద ఇంకా రెండు వారాలకు సరిపడా శాలువాల స్టాక్ ఉన్నందున, భక్తులకు ఇబ్బంది లేకుండా సేవలు కొనసాగుతున్నాయి. కానీ ఈ కుంభకోణంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిగితే మరికొందరు అధికారులు కూడా ఇందులో ఉన్నారనే విషయం బయటపడే అవకాశాలు ఉన్నాయని సమాచారం.
