Ameerpet: హైదరాబాద్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన అమీర్‌పేటలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఇక్కడి ప్రసిద్ధ మైత్రివనం భవనంలోని నీలగిరి బ్లాక్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. భవనం లోపల ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో పాటు, దట్టమైన పొగ అలుముకోవడంతో స్థానికులు, విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ప్రమాదం జరిగిన సమయంలో భవనంలోని నాలుగో అంతస్తులో ఉన్న కోచింగ్ సెంటర్లలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఉన్నారు. మంటలు వేగంగా వ్యాపించడంతో వారు బయటకు రాలేక లోపలే చిక్కుకుపోయారు. పొగ కారణంగా ఊపిరి ఆడక విద్యార్థులు అల్లాడిపోయారు. విషయం తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, మంటలను ఆర్పేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.
ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ ముమ్మరంగా సాగుతోంది. లోపల చిక్కుకున్న విద్యార్థులను అగ్నిమాపక సిబ్బంది బాల్కనీల ద్వారా సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. క్రేన్లు మరియు నిచ్చెనల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు మరియు ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
