Vietnam: వియత్నాం రాజధాని హనోయిలో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనను వియత్నాం పబ్లిక్ సెక్యూరిటీ మంత్రిత్వ శాఖ గురువారం ధృవీకరించింది. ఈ ఘటన మూడు అంతస్తుల కేఫ్‌లో జరిగింది.
కేఫ్ గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉద్యోగులతో గొడవపడ్డ నిందితుడు పెట్రోల్ పోసి నిప్పంటించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో 11 మంది మరణించగా, పలువురు గాయపడ్డారు. నిందితుడిని పోలీసులు అరెస్టు చేయగా, వ్యక్తిగత కక్షతోనే ఈ చర్యకు పాల్పడినట్లు అతడు అంగీకరించాడు.
అగ్నిప్రమాదం తర్వాతి దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. రెస్క్యూ బృందాలు మంటల మధ్య నుంచి ఏడుగురిని రక్షించాయి. వీరిలో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇది హనోయిలో జరిగిన ప్రథమ అగ్నిప్రమాదం కాదు. కొద్ది నెలల క్రితం ఒక అపార్ట్‌మెంట్ భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.
ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, భవనాల భద్రతా ప్రమాణాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అధికారులు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో పేలుడు శబ్దాలు వినిపించాయని, వెంటనే బయటకు పరుగులు తీసినట్లు స్థానికులు తెలిపారు.

