Rajasthan: రాజస్థాన్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. జైపూర్‌లోని అజ్మీర్ రోడ్ భంక్రోటా ప్రాంతంలో స్థానిక పెట్రోల్ బంక్ వద్ద ఆగి ఉన్న సీఎన్‌జీ ట్యాంకర్‌లో మంటలు చెలరేగడంతో భారీ ప్రమాదం జరిగింది. మంటలు క్షణాల్లోనే ట్యాంకర్ నుంచి పక్కనే ఉన్న వాహనాలకు వ్యాపించడంతో పలు వాహనాలు పూర్తిగా దగ్ధమయ్యాయి.
ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులు అక్కడికక్కడే సజీవ దహనం కాగా, మరో 12 మందికి పైగా గాయపడినట్లు సమాచారం. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే 22 ఫైర్ ఇంజిన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమించాయి. అయితే మంటలు భారీగా చెలరేగడంతో ఆకాశమంతా నల్లటి పొగలతో నిండిపోయింది. ఈ కారణంగా పక్కనే ఉన్న రహదారిపై తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గాయపడిన వారిని సవాయ్ మాన్‌సింగ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలాన్ని పరిశీలించేందుకు రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ త్వరలో అక్కడికి చేరుకోనున్నారు.