Fire Accident: మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ సమీపంలోని అన్నోజిగూడ వద్ద శుక్రవారం భయంకరమైన ప్రమాదం తృటిలో తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న ఒక ఓమ్నీ వ్యాన్‌లో ఒక్కసారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. వ్యాన్ నిండా మంటలు వ్యాపించడంతో లోపల ఉన్న ప్రయాణికులు ప్రాణభయంతో అరుపులు వేస్తూ బయటకు దూకేశారు. అందరూ అప్రమత్తంగా కిందకు దిగి పరుగులు తీయడంతో ఎవరికీ ఎటువంటి గాయాలు కాకపోవడంతో పెద్ద ప్రాణనష్టం తప్పింది.
అయితే, మంటలు అంటుకున్న సమయంలో డ్రైవర్ కంగారులో హ్యాండ్ బ్రేక్ వేయకుండానే వాహనం దిగిపోయాడు. దీంతో మండుతున్న ఆ వ్యాన్ అదుపు తప్పి రహదారి పక్కనే ఉన్న పెట్రోల్ బంకులోకి వేగంగా దూసుకెళ్లింది. నిప్పురవ్వలతో ఉన్న వాహనం నేరుగా పెట్రోల్ బంకులోకి రావడంతో అక్కడ ఉన్న వాహనదారులు, సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీశారు. పెట్రోల్ ట్యాంకర్లకు కనుక మంటలు అంటుకుని ఉంటే ఊహించని స్థాయిలో పేలుడు జరిగి ఉండేది.
ఈ క్లిష్ట సమయంలో పెట్రోల్ బంకు సిబ్బంది చూపిన ధైర్యం, సమయస్ఫూర్తిని అందరూ కొనియాడుతున్నారు. మంటలను చూసి భయపడి పారిపోకుండా, వెంటనే అగ్నిమాపక పరికరాలను (Fire Extinguishers) సిద్ధం చేసుకుని వ్యాన్‌పై రసాయనాలు చల్లారు. ప్రాణాలకు తెగించి సుమారు పది నిమిషాల పాటు పోరాడి మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఓమ్నీ వ్యాన్ పూర్తిగా కాలి బూడిదైనప్పటికీ, సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడం వల్ల పెను విపత్తు తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
