AP Liquor Scam: ఆంధ్రప్రదేశ్ లిక్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో నిందితులుగా ఉన్న ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్పలకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీనితో ఈ కేసు మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ కేసులో ఏ31గా ఉన్న ధనుంజయ రెడ్డి, ఏ32గా కృష్ణ మోహన్ రెడ్డి, ఏ-33గా ఉన్న బాలాజీ గోవిందప్పలు డిఫాల్ట్ బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన ఏసీబీ కోర్టు ఇరువైపుల వాదనలు విన్న తర్వాత ముగ్గురికి బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బెయిల్ మంజూరు చేస్తూ, కోర్టు కొన్ని షరతులు విధించింది. ప్రతి ఒక్క నిందితుడు రూ. 1 లక్ష చొప్పున రెండు పూచీకత్తులు (ష్యూరిటీలు) సమర్పించాలని ఆదేశించింది. అలాగే, వారి పాస్‌పోర్టులను కోర్టుకు అప్పగించాలని ఆదేశించింది.
Also Read: Siddaramaiah: సామాన్యులకే కాదు సీఎం కూడా ఫైన్ కట్టిండు
ఈ కేసులో అరెస్టు అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కూడా ఇటీవల మధ్యంతర బెయిల్ లభించింది. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఓటు వేయడానికి కోర్టు ఆయనకు అనుమతి ఇచ్చింది. ఓటు వేసిన తర్వాత తిరిగి కోర్టులో లొంగిపోవాలని ఆదేశించింది. ఎంపీ మిథున్ రెడ్డి విడుదలైన తర్వాత వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసి పరామర్శించారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థికే తమ పార్టీ ఎంపీలు మద్దతు ఇస్తారని వైఎస్ జగన్ ఇప్పటికే ప్రకటించారు. ఈ బెయిల్ మంజూరుతో ఏపీ లిక్కర్ కేసు తదుపరి విచారణలపై అందరి దృష్టి పడింది.

