Uttarakhand: ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలోకి పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. అందులో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. అనేక మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే..
ఉత్తరాఖండ్ లోని అల్మోరా జిల్లాలో సోమవారం ఉదయం 9 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బస్సు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. యాక్సిడెంట్ ను గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.వెంటనే ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది.బస్సులో చిక్కుకుపోయిన వారిని సురక్షితంగా బయటకుతీసి ఆసుపత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి స్పందించారు. ప్రమాదంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.