Mahesh Kumar goud: కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం బీసీలకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తోందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ నేత ముఖ్యమంత్రి అయ్యే సమయం తప్పకుండా వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భవిష్యత్తులో బీసీలకు మరిన్ని అవకాశాలు లభిస్తాయని, అవకాశం ఉన్న ప్రతి చోట బీసీలకు పదవులు ఇస్తూ ముందుకు వెళ్తున్నామని తెలిపారు.
కష్టపడి పనిచేస్తే ఎవరి వాటా వాళ్లకు దక్కుతుందని, దీనిని ఎవరూ అడ్డుకోలేరని మహేశ్ గౌడ్ అన్నారు. రాబోయే రోజులు అన్నీ బీసీలవేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో కాంగ్రెస్ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా పార్టీ ముందుకు సాగుతోందని చెప్పారు.
ఈ సందర్భంగా బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యాఖ్యలకు ఆయన గట్టి కౌంటర్ ఇచ్చారు. దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేయడం దేశానికి మంచిది కాదని, కులం మరియు మతం పేరుతో రాజకీయాలు చేస్తే మన పిల్లలకు మంచి భవిష్యత్తు రాదని వ్యాఖ్యానించారు. రాముడు, అంజనేయుడి పేర్లు చెప్పి బీజేపీ నేతలు ఓట్లు దండుకుంటున్నారని విమర్శించారు.
అర్వింద్ ‘జై శ్రీరాం’ అని నినాదాలు చేయడం కాకుండా, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజల వద్దకు వెళ్లి తాను చేసిన అభివృద్ధి ఏంటో చెప్పి ఓట్లు అడగాలని హితవు పలికారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో తాను చేసిన పనులు ఏమిటో వివరించాలని ఆయన సవాల్ చేశారు. దేవుళ్లను రాజకీయాలతో ముడిపెట్టవద్దని మహేశ్ కుమార్ గౌడ్ మరోసారి స్పష్టం చేశారు.
