Mahesh kumar goud: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌పై తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. శనివారం గాంధీ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, బండి సంజయ్ తక్షణమే తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉక్కు మహిళగా పేరొందిన మాజీ ప్రధాని ఇందిరా గాంధీపై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమని మహేష్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ పాలన సామర్థ్యానికి దావోస్ పెట్టుబడులే సాక్షమని అన్నారు.
మహేష్ గౌడ్ మాట్లాడుతూ, తెలంగాణ స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత రికార్డు స్థాయిలో రూ. 1,78,950 కోట్ల పెట్టుబడులు రావడం ఇదే మొదటిసారి అని చెప్పారు. కానీ, కేసీఆర్ పదేళ్ల పాలనలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని విమర్శించారు. ప్రజలు పదేళ్లుగా కేసీఆర్‌కు అధికారం ఇవ్వగా, ఆయన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని మండిపడ్డారు.
ఇందిరమ్మ ఇళ్లపై ప్రకటన
తెలంగాణ ప్రజల పదేళ్ల నిరీక్షణకు ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయబోతోందని ప్రకటించారు. పేదల పక్షపాతి కాంగ్రెస్ ప్రభుత్వం అని పేర్కొన్నారు.
రిపబ్లిక్ డే సందర్భంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ల పథకం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా వంటి పథకాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు.
బీఆర్ఎస్ నేతలు అభివృద్ధిపై విమర్శలు చేయడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ నాలుగు ముక్కలు కావడం ఖాయమని, ఆ పార్టీలో తండ్రి, కొడుకు తప్ప ఎవరూ మిగలరని సంచలన వ్యాఖ్యలు చేశారు.