Mahesh kumar goud: ఫోన్ ట్యాపింగ్‌పై కేసీఆర్, కేటీఆర్ తలదించుకోవాలి

Mahesh kumar goud: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ మంగళవారం ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన, గత బీఆర్ఎస్ ప్రభుత్వం కాలంలో తమ ఫోన్లను చట్టవ్యతిరేకంగా ట్యాప్ చేశారన్న అనుమానంతో అప్పటి సీఎస్‌కు ఫిర్యాదు చేశామని తెలిపారు.

అప్పట్లో టెలిగ్రాఫ్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ, కాంగ్రెస్ నేతల ఫోన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాప్ చేసిందని ఆరోపించారు. “రాజకీయ ప్రత్యర్థులపై ఈ స్థాయిలో నిఘా పెట్టడం ఒక నీచమైన చర్య. కేసీఆర్, కేటీఆర్ ఇలా చేయడం చాలా బాధాకరం. ప్రజాస్వామ్యానికి ఇది మచ్చలేదే కాదు, ముప్పు కూడా” అని గౌడ్ మండిపడ్డారు.

రేవంత్ రెడ్డితో పాటు తన ఫోన్ కూడా ట్యాప్ చేశారని, ఈ విషయాన్ని అప్పుడే అధికారులకు తెలియజేశామని చెప్పారు. ఇప్పుడు ఒక్కొక్కటిగా నిజాలు వెలుగులోకి వస్తున్నాయని పేర్కొన్నారు.

2022 నుంచి కాంగ్రెస్ సీనియర్ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తూ వచ్చినట్లు తేలిందని చెప్పారు. సిట్ దర్యాప్తులో ఇప్పటివరకు దాదాపు 650 మంది కాంగ్రెస్ నేతల పేర్లు బయటకు వచ్చాయని తెలిపారు. “కుంభం అనిల్ కుమార్ యాదవ్, గాలి అనిల్ వంటి అనేక మంది నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు ఆధారాలు కనిపిస్తున్నాయి” అన్నారు.

ఇది ప్రభుత్వాధికారాన్ని దుర్వినియోగం చేసిన ఘోర ఉదాహరణగా పేర్కొన్నారు. కొన్ని ప్రభుత్వ అధికారులు కూడా రాజకీయ నేతల మాటకు వంతపడి పని చేశారని విమర్శించారు. వ్యక్తిగత గోప్యత హక్కును కాలరాస్తూ ఈ చర్యలకు పాల్పడ్డారని అన్నారు.

“దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా రిటైర్డ్ అధికారిని ఇంటెలిజెన్స్ చీఫ్‌గా నియమించి, నాపై నక్సలైట్లకు సహకరిస్తున్నానన్న ఆరోపణలతో ఫోన్ ట్యాప్ చేయడం నిందనీయమైంది” అన్నారు మహేశ్ గౌడ్.

ఈ వ్యవహారంలో దోషులకు కఠిన శిక్షలు విధించాల్సిందేనని, తద్వారా భవిష్యత్తులో ఇటువంటి చర్యలకు ఎవరూ పాల్పడకుండా నియంత్రణ కలుగుతుందన్నారు. కేవలం రాజకీయ నాయకులే కాదు, తప్పు చేసిన అధికారులు కూడా శిక్షించబడాలని డిమాండ్ చేశారు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *