Mahesh kumar goud: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ), కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంపై మాట్లాడే నైతిక హక్కు ప్రధాని నరేంద్ర మోదీకి లేదని తీవ్రంగా విమర్శించారు. తెలంగాణలో ప్రకృతిని నాశనం చేస్తున్నారని మోదీ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు.
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చెట్ల నరికివేతలు, ప్రకృతి విధ్వంసాలు కనిపించడం లేదా? అని మహేశ్ గౌడ్ ప్రశ్నించారు. తెలంగాణ అభివృద్ధికి ఒక్క రూపాయి ఇవ్వని ప్రధానికి రాష్ట్ర విషయాల్లో మాట్లాడే అర్హత ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ఏ అంశం పట్ల పూర్తి సమాచారం లేకుండా మాట్లాడటం తగదన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలులో ఉన్నాయని గౌడ్ గుర్తుచేశారు. రైతులకు రుణమాఫీ, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, గ్యాస్ సిలిండర్‌ను రూ. 500కి అందించడం, 60 వేల ఉద్యోగాల భర్తీ, రైతు భరోసా వంటి పథకాలను ప్రజల కోసం తీసుకువచ్చామని వివరించారు.
ప్రధాని మోదీ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని గమనించి మాట్లాడాలని సూచించారు. రాష్ట్ర నేతలు చెప్పినట్లు ఏదైనా అనడం తగదు, వాస్తవాలు తెలుసుకొని స్పందించాలని హితవు పలికారు.